మరాఠాల కోసమే పుట్టిన సేన

మరాఠీలకోసం ఉద్యమించిన రీజనల్​ పార్టీ… ఇప్పుడు జాతీయ పార్టీలను తన చుట్టూ తిప్పుకుంటోంది. ఛత్రపతి శివాజీ సైనికులకు నిజమైన వారసత్వం మాదేనని శివసేన ఫౌండర్​ బాల్​ థాక్రే అనేవారు. 70ల్లో మరాఠాల ప్రయోజనాలు కాపాడడంకోసం పాలిటిక్స్​లో శివసేన చురుకుగా పనిచేసింది. బీజేపీతో స్నేహం చేసి 1996 నుంచి బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. ఈ యాభై ఏళ్లలో శివసేన ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంది.

మరాఠా ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ‘శివసేన’ పార్టీ అంతిమ లక్ష్యం. శివసేన అంటే మరాఠా ప్రాంతాన్ని పాలించిన ఛత్రపతి శివాజీ సైనికులని అర్థం. స్వతంత్రం వచ్చిన తరువాత ఫైనాన్షియల్​ కేపిటల్​గా మారిన ముంబై సిటీకి అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వలసలు మొదలయ్యాయి. దాదాపు అన్ని పరిశ్రమల్లోనూ బయటివారు సెటిలయ్యారు. గుజరాతీ, మార్వాడీ వర్గాలకు చెందిన ప్రజలు ముంబై సిటీలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ముంబై సిటీని బయటి జనాలు కమ్ముకునేసరికి… మరాఠీల్లో ఒక రకమైన అభద్రతాభావం తలెత్తింది. తమకు విద్యా, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ పరిణామాల్ని జర్నలిస్టు–కం–కార్టూనిస్టు అయిన బాల్​ థాక్రే జాగ్రత్తగా గమనించారు. భూమిపుత్రులైన మరాఠాలకు పబ్లిక్ , ప్రైవేటు సెక్టార్లలోని ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని ‘మార్మిక్’లో థాక్రే  ఎడిటోరియల్స్ రాశారు. మరాఠా ప్రజల కోసం పోరాడే ఓ రాజకీయ పార్టీ ఉండాలని ఆయన భావించారు. దీంతో 1966 జూన్ 19న ‘శివసేన’ పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని బాల్ థాక్రే  ఏర్పాటు చేశారు. ‘మహారాష్ట్ర మరాఠాలదే’ అనే నినాదమే శివసేనకు ట్యాగ్​ లైన్​.

ముంబైలోని నిరుద్యోగ మరాఠా యువకులు శివసేన వైపు బాగా ఆకర్షితులయ్యారు. ఒకప్పుడు ముంబై ట్రేడ్ యూనియన్లలో లెఫ్ట్ పార్టీల హవానే ఉండేది. కార్మిక సంఘాలన్నీ లెఫ్ట్ పార్టీల చెప్పుచేతల్లో పనిచేసేవి. శివసేన రాజకీయంగా యాక్టివ్ అయ్యాక ఈ పరిస్థితికి చెక్ పెట్టింది. క్రమక్రమంగా  ట్రేడ్ యూనియన్ పాలిటిక్స్ లోకి  సేన ఎంటరై, హవా కొనసాగించింది. ముఖ్యంగా  అతి ముఖ్యమైన టెక్స్ టైల్ ఇండస్ట్రీ కార్మికులను శివసేన తన దారిలోకి తీసుకువచ్చింది.  మరాఠా యూత్​ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఫ్యాక్టరీ, బిజినెస్​ మేనేజిమెంట్లపై శివసేన నాయకులు ఒత్తిడి తీసుకురావడం మొదలైంది. దీంతో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక పరిశ్రమల్లో లోకల్​ యూత్​కి ఉద్యోగాలు దొరికాయి. ఫలితంగా ముంబై సిటీలో శివసేనకు పట్టు పెరిగింది.

అద్భుతమైన వాగ్దాటి

థాక్రే తన కార్టూన్లు, ఎడిటోరియల్స్​తో మేధావులను, అద్భుతమైన వాగ్ధాటితో సాధారణ జనాల్ని ఆకట్టుకున్నారు. ఆయన చేసిన కామెంట్లు తరచు  వివాదానికి దారి తీసినా పట్టించుకునేవారు కాదు.  బాల్ థాక్రే రాజకీయ జీవితంలో అనేక వివాదాలున్నాయి. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు థాక్రే సమర్థించారు. అలాగే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకోసం మండల్ కమిషన్ నివేదికను ఆమోదించడాన్ని థాక్రే వ్యతిరేకించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రశ్నించారు. అదే విధంగా మరఠ్వాడా యూనివర్శిటీ పేరును మార్చాలనుకున్నప్పుడు గట్టిగా ఉద్యమించారు. ఇన్ని విధాలుగా మహారాష్ట్ర  రాజకీయాలపై తన ముద్ర వేసినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగలేదు. కేవలం తెర వెనుక ఉండి రాజకీయాలను శాసించారు.

1971 లోక్​సభ ఎన్నికల్లో తొలిసారిగా శివసేన తన కేండిడేట్లను నిలబెట్టింది. మొదటిసారిగా 1989లో లోక్​సభలో అడుగుపెట్టగలిగింది. ఆ మరుసటి ఏడాదే 52 సీట్లు గెలిచి, మహారాష్ట్ర అసెంబ్లీలో బలమైన శక్తిగా ఎదిగింది. 1995 నాటికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అప్పట్లో థాక్రే సూచించిన ఫార్ములా ప్రకారమే… ఇప్పుడు అధికారం పంచుకుందామని బీజేపీ చెబుతూ వచ్చింది. అయితే, థాక్రే కొడుకు, ప్రస్తుత శివసేన చీఫ్​ ఉద్దవ్​ థాక్రే ఒప్పుకోకుండా, చెరి రెండున్నరేళ్లూ పరిపాలించాలన్న డిమాండ్​ పెట్టారు.

కార్టూనిస్టుగా స్టార్ట్​

బాల్ థాక్రే  1927 జనవరి 23న పూణేలో పుట్టారు. 1950ల్లో ఉద్యోగం వెతుక్కుంటూ ముంబై నగరానికి వచ్చి ఓ  ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో  కార్టూనిస్టుగా చేరారు. 1960లో ఈ ఉద్యోగానికి గుడ్ బై కొట్టి  మరాఠా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి  ‘మార్మిక్’ పేరుతో సొంతంగా ఓ వీక్లీ ప్రారంభించారు. ఠాక్రే పై ఆయన తండ్రి కేశవ్ సీతారాం ఠాక్రే  ప్రభావం ఎక్కువగా ఉండేది. ఉమ్మడి మహారాష్ట్ర  రాజకీయాల్లో కేశవ్ సీతారాం కీలక పాత్ర పోషించారు. మరాఠా భాష మాట్లాడేవాళ్లకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కేశవ్ అప్పట్లోనే డిమాండ్ చేశారు. పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి 1989లో ‘సామ్నా’ పేరుతో మరాఠా డైలీని  శివసేన ప్రారంభించింది. యువత కోసం యువసేన ను ఏర్పాటు చేసింది. కార్మికుల కోసం ప్రత్యేకంగా మరో విభాగాన్ని  పార్టీ ఏర్పాటు చేసింది.

పోటీ చేసిన తొలి థాక్రే … ఆదిత్య 

బాల్ థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత ఆదిత్య థాక్రేకు  దక్కింది. శివసేన యువజన విభాగం యువసేన బాధ్యతలు చూస్తున్న ఆదిత్య, పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే  కొడుకు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.

ఉద్ధవ్​ ప్రవేశంతో చీలిక

బాల్​ థాక్రే చివరి దశలో ఆయన కొడుకు ఉద్ధవ్ థాక్రే శివసేనలోకి ప్రవేశించారు. అప్పటివరకు థాక్రే అన్న కొడుకు రాజ్ థాక్రే శివసేనలో రెండో వ్యక్తిగా చెలామణీ అయ్యేవారు. ఉద్ధవ్​–రాజ్​ల మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంది. పార్టీ డే–టు–డే యాక్టివిటీ మొదలు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వరకు ఉద్ధవ్ తన మాటను నెగ్గించుకోవడం మొదలెట్టారు. దీంతో శివసేన నుంచి రాజ్ తప్పుకున్నారు. 2006 మార్చి 9 ‘మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన’ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని రాజ్ ఏర్పాటు చేశారు.

2012 నవంబర్ 17న బాల్ థాక్రే  చనిపోయాక, శివసేనకు ఉద్ధవ్​ తిరుగులేని నాయకుడయ్యారు. కీలక పదవుల్లో కొ త్త తరం ప్రవేశించింది. ‘మీ ముంబైకర్  (నేను ముంబైవాడిని)’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంతో మరాఠా ప్రజలకు శివసేన మరింత బాగా చేరువైందని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతారు.