ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఫలితాలు సునామీ లాంటివని, అలాంటి రిజల్ట్ వస్తుందని ఎవరూ ఊహించలేదని ఆయన అన్నారు.
శనివారం ముంబైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘లోక్ సభ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే ఇది ఎలా సాధ్యమవుతుంది? అలాంటి విజయం రావడానికి మహాయుతి ప్రభుత్వం ఏం చేసింది? విజయంపై మహాయుతి కూటమికి అభినందనలు తెలపడానికి నాకు అభ్యంతరం లేదు.
కానీ.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి షిండే ప్రభుత్వం చేసిందేమీ లేదు. కరోనా సమయంలో ఒక కుటుంబ పెద్దగా నా మాట విన్న ప్రజలు.. ఇలాంటి తీర్పు చెబుతారని నేను ఊహించలేదు. అయినా.. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం”అని థాక్రే పేర్కొన్నారు.