అచ్చంపేట, వెలుగు: మండలంలోని రంగాపూర్ లోని గ్రామ సమీపంలోని నల్లమల కొండపై వెలసిన ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కొండ దిగువన ఉన్న భోగ మహేశ్వరం కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం జరిపించారు. చైర్మన్ మాధవ రెడ్డి, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, లింగాల, బల్మూరు తదితర మండలాల్లోని గ్రామాల నుంచి భక్తులు డప్పువాయిద్యాలతో తరలివచ్చారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.