దారులన్నీ శ్రీశైలం వైపే.. పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు

దారులన్నీ శ్రీశైలం వైపే.. పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు
  • శివనామ స్మరణతో మారుమోగుతున్న నల్లమల

అమ్రాబాద్, వెలుగు: మహా శివరాత్రి సందర్భంగా శివ స్వాములు కాలినడకన శ్రీశైలం తరలివెళ్తున్నారు. వేల సంఖ్యలో పాదయాత్రగా వెళ్తున్న శివస్వాముల శివ నామస్మరణతో నల్లమల మారుమోగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వాములు తరలి వస్తున్నారు. మార్గమధ్యలో సేద తీరుతున్నారు.

స్వాములకు పోలీసు, అటవీ శాఖ అధికారులు సలహాలు, సూచనలు అందిస్తుండగా, దాతలు తాగునీరు, అన్నదానం, పండ్ల పంపిణీ చేస్తున్నారు. మన్ననూర్, వటవర్లపల్లి, దోమలపెంట గ్రామాల సరిహద్దుల్లో పండ్లు, అన్నదానం చేస్తుండగా, ఫారెస్ట్  అధికారులు వాహనాల్లో తాగునీటిని సప్లై చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మన్ననూర్, వటవర్లపల్లి, దోమలపెంట గ్రామాల వద్ద మెడికల్  క్యాంప్ లను ఏర్పాటు చేశారు. 

కొత్త మార్గంలో వెళ్లవద్దు..

అడవి మార్గంలో వెళ్లే శివస్వాములు తాగునీరు, ఓఆర్ఎస్​ ప్యాకెట్లను తమ వెంట ఉంచుకోవాలని, అధికారులు సూచించిన మార్గంలోనే వెళ్లాలని ఎఫ్​డీవో రామ్మూర్తి, డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. మన్ననూర్‌‌‌‌  నుంచి అడవి మార్గంలో వట్టవర్లపల్లికి 16 కిలో మీటర్ల దూరం ఉంటుందని, రోడ్డు మార్గం అయితే 26 కిలో మీటర్లు అవుతుందని చెప్పారు.

అడవిలో క్రూరమృగాల సంఖ్య భారీగా పెరిగిన దృష్ట్యా రోడ్డు మార్గంలోనే వెళ్లాలని సూచించారు. ప్లాస్టిక్  వాడవద్దని, అడవిలో వంటలు చేయడం, ధూమపానం, మద్యపానం పూర్తిగా నిషేధమని తెలిపారు. శివస్వాములు ఒక్కొక్కరుగా కాకుండా కలిసి ప్రయాణిచడం మంచిదని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో డయల్​100 కు కాల్​ చేయాలని సూచించారు.