వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు, గురుస్వాములు ఆధ్వర్యంలో శివభక్తులకు శివుడి మాలధారణ చేశారు. రాజన్న ఆలయంలో 34 ఏళ్లుగా శివ దీక్షలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు నందగిరి భాను శర్మ, శంకరయ్య శర్మ, శివ గురుస్వాములు వాసాలమరి గోపి, తమ్మల భీమన్న, మచ్చ కిషన్, మ్యాన శ్రీనివాస్, రాపెల్లి శ్రీధర్, సంజీవ్, రవి పాల్గొన్నారు.
నేటి నుంచి త్యాగరాజ ఆరాధనోత్సవాలు
రాజన్న ఆలయంలో నాదబ్రహ్మ లయ బ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రముఖ కళాకారులచే శాస్ర్తీయ, భక్తి, సంగీత, జంత్రవాద్య, సోలో, హరికథ, నృత్య, నాటక, ఉపన్యాస, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలుంటాయి. రాజన్న ఆలయంలో 71 ఏళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన శ్రీ రామ కీర్తనలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది.