వేములవాడలో మార్చి 16 నుంచి శివకల్యాణోత్సవాలు

వేములవాడలో మార్చి 16 నుంచి శివకల్యాణోత్సవాలు
  • మార్చి 17న పార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం
  • ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు
  • ఉత్సవాల సందర్భంగా అభిషేక పూజలు రద్దు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం నుంచి శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 20వ తేదీ గురువారం వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి రోజునే స్వామి వారి కల్యాణం జరుపుతుంటారు.

కానీ వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామదహనం తర్వాత శివ కల్యాణం జరిపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా 17న ఉదయం 10.40 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు పార్వతీరాజరాజేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అలాగే 19వ తేదీన స్వామి వారి రథోత్సవం జరపనున్నారు. శివ కల్యాణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా శివపార్వతులు, జోగినిలు హాజరుకానున్నారు. 

అభిషేక పూజలు రద్దు

శివకల్యాణోత్సవాల సందర్భంగా అభిషేక, నిత్య పూజలను రద్దు చేస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. ఆలయంలో నిత్యం భక్తులు జరిపించుకునే నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన, అభిషేక పూజలు, అన్నపూజలతో పాటు శివకల్యాణం రోజున చండీ సహీత రుద్రహోమాన్ని రద్దు చేస్తున్నామన్నారు. అలాగే కోడెల టికెట్స్ జారీని 16వ తేదీ రాత్రి 11.30 గంటల నుంచి 17 తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేస్తామని ఆఫీసర్లు తెలిపారు.

మూడు రోజుల పాటు డోలా ఉత్సవాలు

శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు డోలా ఉత్సవాలు జరగనున్నాయి. ప్రదోష పూజ అనంతరం కామదహనం నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మూడు రోజుల పాటు శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరపనున్నారు.

అలాగే  త్రిరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి అద్దాల మండపంలో పార్వతీరాజరాజేశ్వర స్వామి, లక్ష్మీఅనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలకరించి డోలోత్సవం నిర్వహిస్తారు.