
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివ కల్యాణ మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకరశర్మ ఆధ్వర్యంలో స్వస్తి పుణ్యాహవచనంతో ఉత్సవాలను ప్రారంభించారు. దీక్షాధారణ, మండప, గౌరీ, నవగ్రహ ప్రతిష్ఠ, అంకురార్పణ, వాస్తుహోమం, అగ్ని ప్రతిష్ఠతో పాటు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు వేదపారాయణాలు, పరివార దేవతార్చన నిర్వహించారు.
గురువారం మధ్యాహ్నం నిర్వహించే స్వామి వారి కల్యాణం కోసం ఆలయ చైర్మన్ ఛాంబర్ ఎదుట ప్రత్యేకంగా కల్యాణమండపం ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఆఫీసర్లు
శివకల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను ఈవో కృష్ణ ప్రసాద్, పోలీసులు బుధవారం పరిశీలించారు. తాగునీరు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేయిన క్యూలైన్లను తనిఖీ చేశారు. ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పనిచేయాలని ఈవో సూచించారు. సమావేశంలో ఏఈవో సంకెపల్లి హరికిషన్, ఆఫీసర్లు అరుణ్ రఘునందన్, ఎడ్ల శివ, రాంకిషన్‌రావు, నరేందర్ పాల్గొన్నారు.