వేములవాడలో 28న శివ కల్యాణం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు శివ కల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో కల్యాణం నిర్వహిస్తారు. కానీ, వేములవాడలో మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామ దహనం తర్వాతే కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ నెల 28న ఉదయం 10.50 గంటల నుంచి 12.55 వరకు కల్యాణం జరుపుతారు. 

30న ఆలయంతో పాటు పట్టణ పరిసరాల్లో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31 వరకు నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన, అభిషేక పూజలు, అన్నపూజలు రద్దు చేశారు. అలాగే కల్యాణం రోజు చండీ సహీత రుద్రహోమం టికెట్స్ ఇవ్వరని, మధ్యాహ్నం 3 గంటల తర్వాతే  కోడెల టికెట్స్​ఇస్తారని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 23 నుంచి 25 వరకు డోలా ఉత్సవాలు నిర్వహించనున్నారు. 23న ప్రదోషపూజ తర్వాత కామదహనం ఉంటుంది.