ఇటుక మీద ఇటుక పెట్టి కట్టుకుంటూ పోతే ఒక నిర్మాణం పూర్తవుతుంది. దానికే కొంచెం కళను కలిపి మనసుపెట్టి కడితే అదో అద్భుతం అవుతుంది. అలాంటిదే ఇక్కడ మీరు ఫొటోల్లో చూస్తున్న మ్యూజియం. కళ్లతో కాదు.. మనసుతో చూడండి.. తపోభంగిమలో ఉన్న ఆ మహాశివుడి రూపం కనిపిస్తుంది. ఇది మనిషి చేసిన మాయ. కళకు జీవం పోయడం అంటే ఇదేనేమో! ఇంతకీ ఈ కట్టడం ఏంటో తెలుసా? దీని పేరు శివ మ్యూజియం. దీని లోపలికి వెళ్తే అక్కడన్నీ శివుడి రూపాలే దర్శనమిస్తాయి.
జైపూర్‌లో సంజయ్ పూరి అనే ఆర్కిటెక్ట్ డబ్ల్యూఎఎఫ్(వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్) ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని కట్టాడు. ఈ కట్టడం ‘వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్’లో కల్చర్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది. ఈ మ్యూజియాన్ని 7,585 చదరపు మీటర్ల స్థలంలో కట్టారు. పైనుంచి చూస్తే... ఇది చీలిన రెండు రంపాల ఆకారంలో కనిపిస్తుంది. దీనికి విజిటర్స్ వెళ్లేందుకు రెండు వైపులా ఎంట్రన్స్ ఉంది.