ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు శివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు భక్తులు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని శివ లింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ఆదిలాబాద్‌లోని గంగపుత్ర శివాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
నిర్మల్ జిల్లాలోని జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లక్ష్మణ చాంద మండలంలోని బాబాపూర్ రాజరాజేశ్వర ఆలయం వద్ద కోయంబత్తూర్‌లోని ఆది యోగి శివుని తరహాలో నిర్మించిన శంకరుడు, నంది విగ్రహాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగ జ్ నగర్ మండలంలోని ఈస్ గాం శివ మల్లన్న ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దహెగాంలోని శివకేశవాలయంలో 11 మంది వేద బ్రాహ్మణులు 51 జంటలతో లఘు రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. చెన్నూర్ లో పంచక్రోస ఉత్తరవాహిణి గోదారిలో భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నేరడిగొండలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం, గుడిహత్నూర్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు చేశారు
- నెట్వర్క్, వెలుగు