
- ఆయన ఆదర్శాలు నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి: అమిత్ షా
రాయ్‌గఢ్(మహారాష్ట్ర): ఛత్రపతి శివాజీ మహరాజ్స్వరాజ్య స్థాపన దేశానికే గర్వకారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.100వ స్వాతంత్య్ర సంవత్సరం నాటికి భారత్ సూపర్ పవర్‌గా ఎదగాలనే ఆశయానికి శివాజీ మహరాజ్ఆదర్శాలైన స్వధర్మ, స్వరాజ్య స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయని చెప్పారు. తనను తాను ప్రపంచ విజేతగా పిలుచుకొని, జీవితాంతం మహారాష్ట్రలో మరాఠాలతో పోరాడిన ఔరంగజేబు.. ఓడిపోయిన వ్యక్తిగా ఈ మట్టిలోనే సమాధి అయ్యారన్నారు.
శనివారం అమిత్‌షా మహారాష్ట్రలోని రాయగఢ్కోటను సందర్శించారు. శివాజీ మహరాజ్ 345వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అమిత్ షా వెంట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, బీజేపీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే, మంత్రులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ పరాక్రమాన్ని కొనియాడారు. శివాజీ మహరాజ్ జన్మించిన సమయంలో దేశం చీకట్లో ఉందని, అయినప్పటికీ ఆయన తన తల్లి జిజాబాయి ప్రేరణతో 12 ఏండ్ల వయసులోనే స్వరాజ్య స్థాపన కోసం ప్రతిజ్ఞ చేశారని చెప్పారు. ఆయన స్వరాజ్యం, స్వధర్మం, భాషా పునరుద్ధరణ కోసం చేసిన కృషిని ప్రశంసించారు.
శివాజీని రాష్ట్రానికే పరిమితం చేయొద్దు
శివాజీ మహరాజ్‌ను కేవలం మహారాష్ట్రకే పరిమితం చేయొద్దని ఆ రాష్ట్ర ప్రజలను అమిత్ షా కోరారు. ఆయన అపారమైన, దృఢ సంకల్పం, ధైర్యం దేశానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. శివాజీ మహరాజ్ మొఘలులను ఓడించారని, వ్యూహాత్మకంగా సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేశారని చెప్పారు. శివాజీ ఆదర్శాలకు అనుగుణంగా మోదీ సర్కారు పనిచేస్తుందని తెలిపారు.