SMAT: వచ్చాడు సిక్సర్లతో హోరెత్తించాడు: తొలి మ్యాచ్‌లోనే సూపర్ కింగ్స్ ఆటగాడు మెరుపులు

SMAT: వచ్చాడు సిక్సర్లతో హోరెత్తించాడు: తొలి మ్యాచ్‌లోనే సూపర్ కింగ్స్ ఆటగాడు మెరుపులు

టీమిండియా ఆల్ రౌండర్.. చెన్నై సూపర్ కింగ్స్ పవర్ హిట్టర్ శివమ్ దూబే నాలుగు నెలల విరామం తర్వాత టీ20 క్రికెట్ ఆడాడు. ముంబై తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దూబే తన రీ ఎంట్రీ తొలి మ్యాచ్ లోనే దుమ్ములేపాడు. హైదరాబాద్‌లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 35 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 భారీ సిక్సర్లు ఉండడడం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. తొలి రౌండ్ మ్యాచ్ లకు దూరంగా ఉన్న దూబే ఈ మ్యాచ్ లో  సూర్య కుమార్ యాదవ్ తో పాటు బరిలోకి దిగాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ తరపున దూబే వరుసగా మూడు సీజన్ ల పాటు నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 2022 ఐపీఎల్ సీజన్ లో 156.21 స్ట్రైక్ రేట్‌తో 289 పరుగులు..  2023లో 158.33  స్ట్రైక్ రేట్‌తో 418 పరుగులు.. 2024లో 162.30  స్ట్రైక్ రేట్‌తో 396 పరుగులు చేశాడు. ఈ క్రమంలో దూబే భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇటీవలే టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో దూబే సభ్యుడు. 2024 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు రూ.12 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకుంది. 

దూబేతో పాటు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సైతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 70 పరుగులు చేసి రాణించాడు. వీరిద్దరి ధాటికి ముంబై 11 ఓవర్లలోనే సర్వీసెస్ పై 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సర్వీసెస్ 151 పరుగులకు ఆలౌట్ అయింది.