భారత యువ క్రికెటర్ శివమ్ దూబేపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ప్రసంశలు కురిపించారు. అతని బాల్ హిట్టింగ్ సామర్థ్యాన్ని బట్టి శివమ్ దూబే 'ఇండియన్ క్రిస్ గేల్' అని పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ 2024కు అతన్ని ఎంపిక చేయడం ద్వారా భారత సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారని పనేసర్ వెల్లడించారు.
2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే, ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఆ సిరీస్‌లో అతను పర్వాలేదనిపించినప్పటికీ.. తరువాత అవకాశాలు మాత్రం రాలేదు. ఏ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ జరిగినా.. జట్టు సీనియర్లతో నిండిపోవడంతో యువకులకు చోటు దక్కేది కాదు. ప్రస్తుతానికి అదే ట్రెంట్ నడుస్తున్నా.. ఈ 28 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో మంచి ప్రదర్శన కనపరిచాడు. దీంతో సెలెక్టర్లు అతన్ని ప్రపంచ కప్‌కు ఎంపిక చేశారు. ఈ సీజన్‌లో దూబే14 మ్యాచ్‌ల్లో 160కిపైగా స్ట్రైక్ రేట్‌తో 396 పరుగులు చేశాడు.
అతని ఆట చూసి ఆశ్చర్యపోయా..!
ఐపీఎల్ 2024లో శివమ్ దూబే ఆట చూసి ఆశ్చర్యపోయానని పనేసర్ పేర్కొన్నారు. కాలు కదపుకుండా అతను బంతిని కొట్టే తీరు, అతని శక్తిని చూశాక క్రిస్ గేల్‌లా కనిపించాడని తెలిపారు.
"రింకూ సింగ్ మంచి ఫామ్‌లో లేనందున మరొకరికి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించడం సరైనది. అతని కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఇతర ఆటగాళ్లు భారత్‌లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా శివమ్ దూబే. అతని ఫామ్ అద్భుతం. అతను బంతిని కొట్టే విధానం నమ్మశక్యం కానిది. బహుశా అతనే ఇండియన్ క్రిస్ గేల్ అని చెప్పొచ్చు.." పనేసర్ అన్నారు.
ఎవరీ శివమ్ దూబే..?
దూబే 1993లో ముంబైలో జన్మించాడు. ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. పంతొమ్మిదేళ్లకే ముంబై అండర్ 23 జట్టులో స్థానం సంపాదించిన దూబే .. 2017లో రంజీ ట్రోఫీ డెబ్యూ చేశాడు. ఇప్పటివరకూ 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో మ్యాచుల్లో 52.55 సగటుతో 1,419 పరుగులు చేశాడు. బౌలర్‌గా 52 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండేళ్ల వ్యవధిలో 2019లో భారత జట్టు తరుపున అరంగేట్రం చేశాడు. దూబే ఆట చూస్తే.. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను చూసినట్లు అనిపిస్తుంటుందని విశ్లేషకుల మాట. నిజంగానే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యువీని తలపించేలా భారీ సిక్సర్లను అలవోకగా కొట్టగలడు.