
- లక్ష్యాన్ని మించి 126 శాతం రుణాలు
- మండల వ్యాప్తంగా దాదాపు 500 యూనిట్ల ఏర్పాటు
- 99 శాతం రుణ రికవరీతో ఆదర్శం
మెదక్/ శివ్వంపేట, వెలుగు: మహిళల ఆర్థికాభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా బ్యాంక్ లింకేజీ కింద అందజేస్తున్న రుణాల సద్వినియోగంలో శివ్వంపేట మండలం మెదక్జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. మండల వ్యాప్తంగా 870 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు ఉన్నాయి. వీటిలో 8,700 మంది మహిళలు మెంబర్లుగా ఉన్నారు. 2024 –- 25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ లింకేజీ లోన్ల టార్గెట్ రూ.26 కోట్లుగా నిర్ధారించారు. ఇప్పటి వరకు నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 275 సెల్ప్హెల్ప్గ్రూపులకు రూ.33.99 కోట్లు రుణాలు అందించడం విశేషం.
ఎన్నో రకాల యూనిట్లు
బ్యాంక్‌లింకేజీ ద్వారా అందిస్తున్న రుణాలతో మహిళా సంఘాల్లో సభ్యులైన మహిళలు స్వయం ఉపాధి కోసం వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. పిండిగిర్ని, కిరాణా షాప్‌లు, ఫ్యాన్సీ స్టోర్లు, టెంట్‌హౌజ్‌లు, హోటల్స్ తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు వ్యవసాయ అవసరాలకు రుణాలను వినియోగించుకున్నారు. ఆయా వ్యాపారాలను సక్రమంగా నిర్వహించుకుంటూ ఆర్థికాభ్యున్నతి సాధిస్తున్నారు. బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను మహిళా సంఘాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నాయి. రుణ రికవరీ 99 శాతం ఉండడం గమనార్హం. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తుండడంతో బ్యాంక్‌లు మహిళా సంఘాలకు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తున్నాయి.
500 యూనిట్లకు ఆర్థిక సాయం
మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించాలనే ఉద్దేశ్యంతో స్వయ ఉపాధి పథకాల కోసం బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు అందిస్తున్నాం. మండలంలో 500 యూనిట్లకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేశాం. మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వడంలో శివ్వంపేట మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాం. దీంతో రుణాలు తీసుకున్న అందరూ వ్యాపారాలు పెట్టుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. ఇచ్చిన రుణాలను 99 శాతం రికవరీ చేశాం. – వారాల సరిత, ఐకేపీ సీసీ, శివ్వంపేట
రెస్టారెంట్ పెట్టుకున్నా
మహిళా శక్తి ద్వారా రూ.5 లక్షల లోన్ఇచ్చారు. ఆ మొత్తంతో మినీ రెస్టారెంట్ పెట్టుకున్నా. తీసుకున్న లోన్‌లో 35 శాతం సబ్సిడీ వస్తుంది. ఇది మా కుటుంబానికి ఎంతో మేలు కలిగించే విషయం. రెస్టారెంట్ చాలా బాగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా మహిళా శక్తి ద్వారా మాలాంటి మహిళలందరికీ రుణాలు అందించడం సంతోషంగా ఉంది.
నవనీత, ఎస్‌హెచ్‌జీ మెంబర్, పెద్ద గొట్టిముక్కుల
నా కాళ్ల మీద నేను నిలబడుతున్నా
మహిళా శక్తి ద్వారా రెండు లక్షలు లోను తీసుకొని పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్నా. బయట పనికి వెళ్లకుండా సొంతంగా బిజినెస్పెట్టుకుని డబ్బులు సంపాదిస్తూ నా కాళ్ల మీద నేను నిలబడ్డా. ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా ఉపాధి కల్పించడం బాగుంది.
సుమలత, రోహిణి గ్రూప్ మెంబర్, చిన్న గొట్టి ముక్కుల