శివశివా.. గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లారు

శివశివా..  గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లారు

ఈ మధ్య దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికిందల్లా దోచేస్తున్నారు దేన్నీ వదలడం లేదు.  గుడిలో లింగాన్ని కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. శివారాత్రి  ఉత్సవాలకు శివలింగాన్ని  ముస్తాబు చేసి ఉత్సవాలకు రెడీ చేశారు ఆలయ అధికారులు. సరిగ్గా శివరాత్రికి ఒక రోజు ముందే లింగాన్ని ఎత్తుకెళ్లారు.  గుజరాత్ లోని  ద్వారక జిల్లాలో  జరిగిన  ఘటన కలకలం రేపుతోంది.

కళ్యాణ్‌పూర్‌లోని అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హర్సిద్ధి మాతాజీ ఆలయం సమీపంలోని  శ్రీ భిద్భంజన్ భవనీశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఫిబ్రవరి 25న ఈ సంఘటన జరిగింది. శివరాత్రికి ముస్తాబు చేసిన శివలింగాన్ని తన స్థానం నుంచి పెకిలించి  ఎత్తుకెళ్ళారు. ఆలయ పూజారి గుడి తలుపులు తీసి చూసే సరికి తలుపులు తెరిచే ఉన్నాయని..శివలింగం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేవారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గుడిలో మిగిలిన వస్తువులు ఎక్కడివక్కడే ఉన్నాయి కానీ శివలింగాన్ని ఎత్తుకెళ్లారని  తెలిపారు.

ఆలయం సమీపంలోని బీచ్ లో శివలింగం అడుగు భాగం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సముద్రంలోని శివలింగాన్ని  వెతికి తీసుకునేందుకు   స్కూబా డైవర్ల బృందాన్ని రప్పించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్థానిక క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ,  స్థానిక పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు , డాగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై  భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 305 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.