- తప్పుడు లైంగిక ఆరోపణలతో.. చితక్కొట్టి మలం తినిపించిన్రు
- మధ్యప్రదేశ్లో ఘటన
- ఇద్దరు యువకులపై మైనారిటీ ఫ్యామిలీ దాడి
- బాధితుల్లో ఒకతను దళితుడు
- దాడిని ఖండించిన హోంమంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్లో మరో దారుణం జరిగింది. లైంగికంగా వేధించారనే తప్పుడు ఆరోపణలతో ఇద్దరు యువకులను మైనారిటీ కుటుంబం చిత్రహింసలకు గురి చేసింది. ముఖానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పుల దండ వేసి.. బలవంతంగా మలం తినిపించింది. ఆపై పట్టణంలో ఊరేగించింది. ఈ ఘటన పోయిన నెల 30న శివపురి జిల్లా నార్వార్ ఏరియాలోని వార్ఖాడిలో జరిగింది. ఇద్దరు యువకుల్లో ఒకతను జాతవ్ కమ్యూనిటీకి చెందిన దళితుడు కాగా, మరొకతను కేవత్ కమ్యూనిటీలోని వెనుకబడిన వర్గానికి చెందినవాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొన్ని రోజుల కింద ఓ గిరిజనుడిపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా ఘటనపై బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మైనారిటీ ఫ్యామిలీలోని ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేశారు.
నిందితులపై జాతీయ భద్రతా చట్టం అమలు
ఇద్దరు యువకులపై మైనారిటీ కుటుంబ సభ్యులు చేసిన లైంగిక ఆరోపణల్లో నిజంలేదని పోలీసులు తెలిపారు. యువకులపై తప్పుడు ఆరోపణలు చేశారని ప్రకటించారు. ఆస్తి వివాదం నేపథ్యంలోనే దాడికి తెగబడ్డారని వివరించారు. దాడిని హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. హింస, దాడిని మానవత్వం సిగ్గుపడే తాలిబన్ చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని అస్సలు వదిలిపెట్టమన్నారు. నిందితులను అరెస్ట్ చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) ప్రయోగించి, అక్రమంగా నిర్మించిన వారి ఆస్తులను కూల్చేయాలని శివపురిలోని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. లోకల్ కాంగ్రెస్ లీడర్లు అధికారులకు ఫోన్లు చేసి విషయాన్ని వెలుగులోకి రాకుండా చూడాలని ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించడం మరింత సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.