ఇండోర్ బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఇండోర్ బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం ప్రమాద ఘటన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉదయమే పెద్ద సంఖ్యలో మున్సిపల్, పోలీసులు ఆలయానికి వెళ్లారు. బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు ఐదో బుల్డోజర్లు చేరుకున్నాయి. స్థానికుల నుంచి వ్యతిరేకత  రాకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఘటనా స్థలంలోనే మున్సిపల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్, ఇతర ఉన్నతాకారులు ఉన్నారు. వీరంతా కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 

మార్చి 31న  శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలింది.  మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 36 మంది దుర్మరణం పాలయ్యారు. ఇండోర్‌ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్‌ ట్రస్ట్‌ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు.

ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్‌ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇండోర్‌ మున్సిపల్‌ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్‌లోనే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్‌ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్‌ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది.   

మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లుశివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పింది. ఈ ఘటనపై మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది. మరోవైపు.. ఆలయ ట్రస్టుకు చెందిన ఇద్దరు అధికారులపై పోలీసు కేసు నమోదైంది. అక్రమ నిర్మాణాలను తొలగించనందుకు ఇద్దరు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేశారు.