
- ఈ నెల 23 నుండి 28 వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలు
- 25న రామలింగేశ్వరస్వామి కల్యాణం
- 27న లక్షబిల్వార్చన, రథోత్సవం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. ఇందుకోసం కొండపైన ఉన్న అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో ఆలయ ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, ఏర్పాట్లు చేశారు. ఎండల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం శివాలయ ముఖ మంటపం మొత్తం చలువ పందిళ్లు వేసి భక్తుల దాహార్తి తీర్చడం కోసం తాగునీరును అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
శివాలయంలో ఆదివారం స్మార్త ఆగమ శాస్త్రం ప్రకారం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు స్వస్తివాచనంతో శివరాత్రి ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24న ధ్వజారోహణం, భేరీపూజ, దేవతా ఆహ్వానం, అగ్నిప్రతిష్ట నిర్వహించనున్నారు. 25న ఉదయం 10 గంటల నుంచి రుద్రహవనం జరిపించిన అనంతరం.. రాత్రి 7 గంటలకు రామలింగేశ్వరస్వామి కల్యాణం జరపనున్నారు.
26న శివరాత్రి సందర్భంగా.. ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేకాలు, రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. 27న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లక్షబిల్వార్చన, రాత్రి 7.40 గంటల నుంచి రథోత్సవం జరపనున్నారు. ఇక 28న మధ్యాహ్నం నిర్వహించే మహాపూర్ణాహుతి, డోలోత్సవంతో శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి టికెట్లు
శివాలయంలో ఈ నెల 23 నుండి 28 వరకు నిర్వహించే శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని నిర్వహించే పలు రకాల పూజలకు టికెట్లను ఆలయ ఆఫీసర్లు అందుబాటులోకి తెచ్చారు. శివకల్యాణ టికెట్ ధర రూ.516, అభిషేకం టికెట్ ధర రూ.300, శతరుద్రాభిషేకం ధర రూ.516, లక్షబిల్వార్చన టికెట్ ధర రూ.516గా ఆఫీసర్లు నిర్ణయించారు. ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆఫీసర్లు వెల్లడించారు.