నేచర్ లవర్స్​కు ఇలాంటి ప్లేస్ బాగా నచ్చుతది

చెట్లు, గుట్టలు... మధ్యలో గోదావరి నది. చెట్ల కొమ్మల మీద గెంతులు వేసే కోతులు, కిలకిలరావాలతో పలకరించే రకరకాల పక్షులు. ఇలాంటి  వాతావరణంలో కొంచెంసేపు ఉన్నా మనసు తేలిక పడుతుంది. నేచర్​ ఫొటోగ్రఫీని ఇష్టపడే వాళ్లకు, నేచర్ లవర్స్​కు ఇలాంటి ప్లేస్ బాగా నచ్చుతుంది. పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండే శివ్వారం వైల్డ్​ లైఫ్ శాంక్చురీ కూడా అలాంటిదే. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఈ శాంక్చురీకి వీకెండ్​లో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు.

ఈ శాంక్చురీ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. దాదాపు 36 చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే... మార్ష్​ జాతి మొసళ్లు. ఈ మొసళ్లను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ శాంక్చురీని ఏర్పాటు చేశారు. ఇవి మంచినీళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ‘మగ్గర్ మొసళ్లు’ అని కూడా  పిలుస్తారు. ఈ మొసళ్లు మిగతా మొసళ్ల కంటే ఎక్కువ దూరం నేల మీద పాక్కుంటూ వెళ్లగలవు. అంతేకాదు నీళ్లలో, నేల మీద కూడా మార్ష్​ మొసళ్లు ఒకే వేగంతో వెళ్తాయట. 

అరుదైన చెట్లు, జంతువులు

ఈ శాంక్చురీలో ఆకురాల్చే చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.  తెల్ల మద్ది, నల్లమద్ది, నల్లకొడిశ వంటి ఔషధగుణాలున్న చెట్లతో పాటు టేకు, ముండ్ల జాతి చెట్లు బాగా ఉంటాయి. ఎలుగుబంటి, నీల్​గాయ్, చిరుత, మచ్చల జింకలు, లంగూర్ కోతులు, మకాక్ జాతికి చెందిన రీసస్​ కోతుల్ని చూడొచ్చు. ఇవేకాకుండా రంగురంగుల రామచిలుకలు, నెమళ్లు, గద్దలు కూడా కనిపిస్తాయి. ఇక్కడి వాచ్ టవర్ ఎక్కి చూస్తే ఈ శాంక్చురీ మొత్తం కనిపిస్తుంది. శాంక్చురీలో పక్షులు కిలకిలరావాలు వింటుంటే ఎంత దూరం నడిచినా అలసట తెలియదు. ఇక్కడ బోటు షికారు  చేస్తూ గోదావరి నది, ఆ పక్కనే ఉన్న పచ్చని  పంట పొలాల్ని చూస్తుంటే మనసు పులకరిస్తుంది. 

ఇలా వెళ్లాలి

మంథని నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది శివరాం వైల్డ్​లైఫ్​ శాంక్చురీ. మంచిర్యాల నుంచి 50 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 260 కిలోమీటర్లు. 

టైమింగ్స్: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8:30 వరకు.