T20 World Cup 2024: పోయి పోయి అమెరికా చేతిలో ఓడటమేంటి..? రాత్రంతా నిద్ర లేదు: పాక్ మాజీల నోట బూతులు

T20 World Cup 2024: పోయి పోయి అమెరికా చేతిలో ఓడటమేంటి..? రాత్రంతా నిద్ర లేదు:  పాక్ మాజీల నోట బూతులు

టీ20 ప్రపంచకప్‌ 2024లో సంచలన విజయం నమోదైంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన పాకిస్తాన్ జట్టు.. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా చేతిలో పరాజయం పాలైంది. ఓటమినుంచి గట్టెక్కే అవకాశాలు వచ్చినప్పటికీ.. బాబర్ సేన చేజేతులా చేజార్చుకుంది. సూపర్ ఓవర్‌లో చిత్తయ్యింది. ఈ ఓటమిని ఆ దేశ అభిమానులు, మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

అమెరికా చేతిలో పరాజయం పాలవ్వడాన్ని పాక్ క్రికెట్ అభిమానులు ఓర్వలేకపోతున్నారు. క్రికెటర్లను బండబూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆటగాళ్లకు మద్దతు పలకాల్సిన మాజీలు.. అభిమానులకే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయడమే కాదు.. ఆటగాళ్లు చేసిన ఓవర్ యాక్షన్ ను ఎత్తిచూపుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

ఆర్మీ చేత కఠిన శిక్షణ 

ప్రారంభానికి నెలరోజుల ముందు పాకిస్తాన్ జట్టు ఆ దేశ ఆర్మీ చేత కఠిన శిక్షణ తీసుకుంది. కొండలు, గుట్టలు ఎక్కడాలు.. పొర్లుతూ, దొర్లుతూ కఠిన వ్యాయామాలు గట్రా చేశారు. అవన్నీ ఓటమి పాలవ్వడానికే చేశారని మాజీలు చెప్తున్నారు. వకార్ యూనిస్ ఒకడుగు ముందుకేసి అవన్నీ చేయడం వల్ల ఆటగాళ్లు అలసిపోయారని ఎద్దేవా చేశాడు.

గెలిచే అర్హత లేదు

అనుభవంలో వెనుకబడినప్పటికీ.. మైదానంలో అమెరికా అత్యుత్తమ ఆటతీరు కనపరిచిందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్ గెలవడానికి అర్హులు కారని విమర్శించాడు. ఈ ఓటమి తమ జట్టును 20 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్లిందని భావోద్వేగంతో మాట్లాడాడు. 

ఇక పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. జట్టు మైదానంలో నిస్సహాయంగా, అలసిపోయినట్లు కనిపించిందని చెప్పుకొచ్చాడు. బహుశా ఆర్మీ చెంత కఠిన శిక్షణ తీసుకోవడం వల్లే ఇలా అయ్యుండవచ్చని ఎద్దేవా చేశాడు. 

 మరోవైపు యూఎస్ఏ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా షాక్ కు గురయ్యారట. రాత్రి నిద్ర పట్టలేదని వాపోయాడు.

సంక్షిప్త స్కోర్లు:

  • పాకిస్థాన్‌: 20 ఓవర్లలో 159/7 
  • అమెరికా: 20 ఓవర్లలో 159/3

సూపర్‌ ఓవర్‌ స్కోర్లు

  • అమెరికా: 18/1
  • పాకిస్థాన్‌: 13/1