Jasprit Bumrah: బుమ్రా నా మాట విను.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించు: షోయబ్ అక్తర్

Jasprit Bumrah: బుమ్రా నా మాట విను.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించు: షోయబ్ అక్తర్

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక సూచన చేశాడు. తక్షణమే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించాడు. ఎక్కువకాలంపాటు క్రికెట్‌లో కొనసాగాలనులంటే ఇదొక్కటే మార్గమని హెచ్చరించాడు. తాను భారత పేసర్ స్థానంలో ఉండుంటే అదే పని చేసేవాడనని అక్తర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

పొట్టి ఫార్మాట్లలో బుమ్రా తన లైన్ అండ్ లెంగ్త్‌తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించగగలడని అక్తర్ అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్‌లో బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించనందున భారత పేసర్ ఎక్కువ శ్రమించాల్సి వస్తోందని పాక్ మాజీ అన్నారు. అదే సమయంలో టెస్టు క్రికెట్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో ఫాస్ట్‌ బౌలర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎదురవుతున్న గాయాల సమస్యను అక్తర్ హైలైట్ చేశారు.

ALSO READ | Big Bash League: ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్.. బిగ్ బాష్ పోరుకు వేళాయె

"మీకు ఈ విషయం తెలుసు అనుకుంట..! టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు ఎక్కువసేపు స్పెల్స్‌ వేయాల్సి ఉంటుంది. బ్యాటర్లు దూకుడుగా ఆడటానికి ప్రయత్నించరు. అప్పుడు లైన్ అండ్ లెంగ్త్ తో పాటు వేగాన్ని పెంచాలి. బంతిని వేగంగా సంధించకపోతే సీమ్‌ అవ్వదు, రివర్స్‌ స్వింగ్ కాదు. అలాంటప్పుడు మరింత ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. టెస్ట్ క్రికెట్‌ ఆడగల సత్తా బుమ్రాలో ఉంది. వికెట్లూ తీయగలడు. కానీ, వేగాన్ని పెంచే ప్రయత్నంలో అతను గాయపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఎక్కువ కాలం కొనసాగలేడు."

"బుమ్రా పొట్టి ఫార్మాట్‌(టీ20, వన్డే)కు మంచి బౌలర్. అతను లైన్ అండ్ లెంగ్త్‌ని అర్థం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో, పవర్‌ప్లేలో బంతిని రెండు వైపుల స్వింగ్ చేయగలడు. అతని ఖచ్చితత్వం అద్భుతమైనది.. " అని అక్తర్ అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 11.25 సగటుతో 12 వికెట్లతో బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. అందుకు అతను ఎంత శ్రమిస్తున్నాడో.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చుసిన వారికే అర్థమవుతోంది. జట్టులో మరో ఇద్దరు పేసర్లు తనకు తోడుగా ఉన్న బుమ్రాపైనే భారమంతా. వికెట్ తీయాలన్నా.. పరుగులు రాకుండా కట్టడి చేయాలన్నా బుమ్రా చేతికి బంతిని అందుకోవలసిందే. భారత జట్టులో ఇదే ప్రధాన సమస్య.