IND vs ENG 4th Test: వరుసగా రెండు వికెట్లు.. గిల్ మీదే భారత్ భారం

రాంచీ టెస్టులో అద్భుతం జరిగేలా కనిపిస్తుంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో టీమిండియా పరుగులు చేయడానికి తడబడుతుంది. పరుగులు రాకపోగా వికెట్లు టప టప పడిపోతున్నాయి. లంచ్ తర్వాత పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో ఇంగ్లీష్ స్పిన్నర్ బషీర్ వరుస బంతుల్లో వికెట్లు తీసి భారత్ ను కష్టాల్లోకి నెట్టాడు. 3 వికెట్ల నష్టానికి 118 పరుగులతో లంచ్ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన భారత్ ప్రస్తుతం 5 వికెట్లను 121 పరుగులు చేసింది. 

ఇన్నింగ్స్ 39 ఓవర్ తొలి బంతికి జడేజా, రెండో బంతికి సర్ఫరాజ్ ఔటయ్యాడు. ఉన్నంత సేపు పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డ జడేజా.. 33 బంతుల్లో 4 పరుగులు చేశాడు. రాజ్ కోట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసిన సర్ఫరాజ్.. మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. క్రీజ్ లో గిల్ (19), జురెల్ (1) ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 69 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో గిల్ పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఫామ్ లో ఉన్న జురెల్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. హార్టిలి, రూట్ కు తలో వికెట్ దక్కింది.