
ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర క్రికెటర్లకు కొదువ లేదు. వివి రిచర్డ్స్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్కలం, గిల్క్రిస్ట్, షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటారు. అయితే మూడు ఫార్మాట్ లలో ప్రత్యర్థి బౌలింగ్ దళాన్ని చిత్తు చేయగల ఆటగాళ్లు అతి కొద్ది మందే ఉంటారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రపంచ క్రికెట్ లో ఎవరు విధ్వంసకర ఆటగాల్లో తన అభిప్రాయాన్ని తెలిపాడు. వీరిలో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఒక ఇండియన్ క్రికెటర్ ఉన్నారు.
తప్‌మాడ్‌లో జరిగిన సంభాషణలో మాలిక్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్‌లతో పాటు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అత్యంత విధ్వంసకర ఆటగాళ్ళని కొనియాడాడు. వీరి ముగ్గురు ఎందుకు పవర్ ఫుల్ ఆటగాల్లో వివరించాడు. "మూడు ఫార్మాట్లలో ఆడాలంటే ఆటగాళ్ల మనస్తత్వం బలంగా ఉండాలి. మీరు మానసికంగా బలంగా ఉంటే, ఏ ఫార్మాట్‌లోనైనా ఆడవచ్చు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను మీ శైలికి అనుగుణంగా మలచుకోవాలి" అని మాలిక్ వివరించాడు.
"ట్రావిస్ హెడ్ మూడు ఫార్మాట్లలోనూ ఆడతాడు. అతను టెక్నీకల్ గా మెరుగైన ఆటగాడు. ఆ తర్వాత ఈ లిస్టులో డేవిడ్ వార్నర్ ఉంటాడు. అతను బ్యాక్ ఫుట్ మీద ఉంటూ డ్రైవ్‌లు కొడతాడు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా పవర్ హిట్టింగ్ చేయగలడు. సెహ్వాగ్, హెడ్, వార్నర్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ తొందరగా మ్యాచ్ ను చేతుల్లోకి తీసుకుంటారు. వీరి దూకుడైన ఆటతీరు ప్రత్యర్థి బౌలర్లను వెనకంజలో పడేస్తుంది". అని మాలిక్ వివరించాడు.
పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇప్పటికే టెస్ట్, వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను టీ20 కెరీర్‌కు ఎప్పుడు ముగింపు పలకాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు.42 ఏళ్ళ మాలిక్ ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 లో పాకిస్థాన్ జట్టుకు అందుబాటులో ఉంటానని చెప్పినా.. అతన్ని సెలక్ట్ చేయలేదు. మాలిక్ చివరిసారిగా దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ లో ఆడాడు. ఇప్పటివరకు పాకిస్థాన్ తరపున 124 టీ20 మ్యాచ్ ల్లో 2435 పరుగులు చేశాడు. వీటిలో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 287 వన్డేల్లో 7534.. 35 టెస్టుల్లో 1838 పరుగులు చేశాడు.