షోయబ్ మాలిక్ పై ఫిక్సింగ్ ఆరోపణలు.. బీపీఎల్ కాంట్రాక్ట్ రద్దు

షోయబ్ మాలిక్ పై ఫిక్సింగ్ ఆరోపణలు.. బీపీఎల్ కాంట్రాక్ట్ రద్దు

ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మాలిక్ కు ఏదీ కలిసి రావడం లేదు. సోషల్ మీడియాలో ఈ పాక్ క్రికెటర్ ను తీవ్రంగా విమర్శించారు. అతడిని ఒక చెడ్డ వాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా మాలిక్ మరో కొత్త సమస్యలో ఇరుక్కున్నాడు. ఫిక్సింగ్ అనుమానాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) కాంట్రాక్ట్ రద్దు చేసింది. శుక్రవారం (జనవరి 26) బీపీఎల్ ఈ విషయాన్ని ప్రకటించింది.  
  
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 (BPL 2024) సీజన్‌లో భాగంగా జనవరి 22 న ఖుల్నా టైగర్స్‌ తో జరిగిన మ్యాచ్ లో ఫార్చ్యూన్ బరిషల్ తరపున మాలిక్ ఆడుతున్నాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు బౌలింగ్ వేయడానికి వచ్చిన మాలిక్.. ఒక ఓవర్ లో ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. ఈ మాజీ పాక్ ఆటగాడు నో బాల్స్ ధాటికి నాన్ స్ట్రైకర్ లో ఉన్న బ్యాటర్ అసలు రన్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఏకంగా క్రీజ్ కు చాలా దూరంలో ఉన్నాడు. మొత్తం ఈ ఓవర్ లో 18 పరుగులు వచ్చాయి.

ఈ మ్యాచ్ తర్వాత ఫార్చ్యూన్ బరిషల్ BPL 2024 మ్యాచ్‌లో మాలిక్ పేలవంగా రాణించాడని ఆరోపించారు. అతను వేసిన ఒకే ఓవర్‌లో మూడు నో-బాల్స్ వేసి, ఖుల్నా టైగర్స్‌పై 18 పరుగులు ఇవ్వడంతో పాటు డెత్ ఓవర్‌లో 6 బంతుల్లో 5 పరుగులే చేశాడు. పాకిస్థాన్ తరపున మాలిక్ 2021లో బంగ్లాదేశ్ పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మొత్తం తన అంతర్జాతీయ కెరీర్ లో పాకిస్థాన్ తరపున 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు.    

పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ మోడల్, నటి అయిన సనా జావేద్ ను మాలిక్ ఇటీవలే వివాహమాడాడు. మాలిక్ కు ఇది మూడో వివాహం. వీరి పెళ్లి ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2010లో మొదట భార్య అయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ మాలిక్ అదే ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు.