అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలం : శోభ కరంద్లాజే

నల్గొండ అర్బన్/మిర్యాలగూడ, వెలుగు : కేసీఆర్​ప్రభుత్వం పనితీరు ఏమీ బాగాలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. దేశంలో తెలంగాణలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఫసల్​బీమా యోజన అమలవుతుంటే తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. 

రాష్ట్రంలో అత్యధికంగా 5,943 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ నెంబర్​ వన్​గా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ సమృద్ధి యోజన ద్వారా రాష్ట్రంలోని 41 లక్షల మంది రైతుల బ్యాంక్​అకౌంట్లలో రూ.2.40 లక్షల కోట్లు వేసినట్టు తెలిపారు. డబుల్​ ఇంజిన్​ సర్కార్​తోనే దేశం అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో కూడా డబుల్​ ఇంజిన్​ సర్కార్​ను తెచ్చేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ అని రెండుసార్లు కేసీఆర్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. 

మళ్లీ ఏ ముఖం పెట్టుకొని మేనిఫెస్టో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధానిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ​ నియోజకవర్గాల సమావేశాలలో ఆమె పాల్గొని బీజేపీ బలోపేతం, గెలుపు కోసం దిశా నిర్దేశం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీజేపీ గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ  సంఘటన మంత్రి మధుకరణ్, రాష్ట్ర పార్టీ వైస్ ప్రెసిడెంట్ విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదాగోని శ్రీనివాస్ గౌడ్, నల్గొండ జిల్లా ఇంచార్జి ప్రదీప్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.