పాపికొండల పర్యాటకులకు షాక్

  • రాత్రి బసను నిషేధిస్తూ అటవీశాఖ ఆర్డర్స్

భద్రాచలం, వెలుగు : పాపికొండల పర్యాటకులకు అటవీశాఖ షాక్ ఇచ్చింది. రాత్రి వేళల్లో పాపికొండల్లో హట్స్ లో బస చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇప్పటికే బుకింగ్​ కూడా ఆపేశారు. దీంతో భద్రాచలం మీదుగా ప్రతి శని, ఆదివారాల్లో పాపికొండల్లో రాత్రి ఆహ్లాదంగా గడపాలనుకునే పర్యాటకులకు నిరాశ ఎదురైంది. పాపికొండలు అభయారణ్యం కావడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా వాటిని సంరక్షించేందుకు అటవీశాఖ మొదటి నుంచి టూరిజానికి అభ్యంతరం చెబుతూ వస్తోంది. అయితే లాంచీ ఓనర్లు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చుకుని తాత్కాలిక అనుమతులతో నడిపిస్తున్నారు. కానీ, ఫిబ్రవరి నెలతో అది కూడా ముగిసింది.

దీంతో వీఆర్​పురం మండలం తుమ్మిలేరు సెక్షన్​ఆఫీసర్​ బుచ్చిరాజు కొల్లూరులో రాత్రి బస చేసేందుకు అనుమతులు లేవని, టిక్కెట్లు బుకింగ్​చేయొద్దని లాంచీ ఓనర్లను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే విహారయాత్ర మాత్రం యధాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాపికొండల్లోని కొల్లూరు హట్స్ లో రాత్రి బస నిలిచిపోయింది. మరోవైపు లాంచీ ఓనర్లు అనుమతుల కోసం మళ్లీ కోర్టుకు ఎక్కబోతున్నారు.