
- సహకరించిన ప్రియుడు
గూడూరు, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తకు కరెంట్షాక్పెట్టి చంపిందో భార్య. గూడూరు సీఐ ఫణిదర్కథనం ప్రకారం..మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన అజ్మీరా రవి(35) , కవిత భార్యాభర్తలు. అక్టోబర్ 24న పొలానికి వెళ్లిన రవి అనుమానాస్పద స్థితిలో కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. అతడి తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. రవి భార్య కవితపై అనుమానం రావడంతో ఎస్ఐ రాణాప్రతాప్ ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఇందులో కవిత.. దుబ్బగూడెం గ్రామానికి చెందిన వరుసకు మరిది అయిన ఆజ్మీర శివకుమార్ తో కలిసి చంపినట్లు తేలింది. ఏడేండ్ల నుంచి రవి భార్య కవితతో శివ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది గుర్తించిన రవి వారిని హెచ్చరించాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.
పైగా తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రవిని చంపేందుకు ప్లాన్‌వేశారు. అక్టోబర్ 23న రవి పొలానికి వెళ్లిన కవిత, శివ కరెంట్‌వైర్లు ఏర్పాటు చేసి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్నుంచి కనెక్షన్తీసుకుని పొలంలో వదిలారు. 24న ఉదయం పొలానికి వెళ్లిన రవి ఆ వైర్లను తొక్కి కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. మధ్యాహ్నం మూడు గంటలకు ఏమీ తెలియనట్టు పొలానికి వెళ్లిన కవిత తన భర్త చనిపోయాడంటూ కుటుంసభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. పీఎస్‌లోనే ఆ విధంగానే కంప్లయింట్ఇచ్చింది. అయితే ఎస్ఐకి అనుమానం రావడంతో పొలానికి వెళ్లి పరిశీలించాడు. వైర్లు కావాలనే ఏర్పాటు చేసినట్టు అనిపించడంతో అనుమానితులను విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్‌చేసి రిమాండ్ కు తరలించారు.