మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్య టింబర్ డిపోలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం దర్యాప్తులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. అగ్నిప్రమాదంలో నరేష్, సుమ దంపతులు, వారి ఆరేళ్ల కుమారుడు జశ్వంత్ చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో నిద్రలో ఉండడం వల్ల పొగ పీల్చుకోవడంతో ముగ్గురు చనిపోయి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. నరేష్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడిని వాళ్ల మేనమామ ఏప్రిల్ 15వ తేదీ రాత్రి తమ వెంట ఇంటికి తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
భారీగా మంటలు
సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో టింబర్ డిపో పక్కనే ఉన్న ఇండ్లకు కూడా వ్యాపించాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని అందరూ భయపడ్డారు. అప్పటికే ఫైర్ ఇంజన్లు, స్థానిక పోలీసులు, ప్రజాప్రతినిధులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.
తీరని శోకం
అగ్నిప్రమాదంలో కుమారుడు, కోడలు, మనవడు మృతిచెందడంతో నరేష్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుండడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. గత రెండు నెలల నుండి తమ కుమారుడు కుషాయిగూడలో నివాసం ఉంటూ..స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో డ్రైవర్ పని చేస్తున్నాడని మృతుడు నరేష్ తండ్రి చెన్నయ్య చెప్పాడు. తమ కుమారుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. తమ పెద్ద మనువడిని ఏప్రిల్ 15న వాళ్ల మేనమామ తీసుకెళ్లడంతో అతడు బతికి ఉన్నాడని చెప్పాడు. తమ కొడుకు, కోడలు, మనువడు మంటల్లో కాలిపోయారంటూ బోరున విలపించాడు. ‘‘తల్లిదండ్రులు లేని అనాథగా నా మనవడు మిగిలాడు. నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. నా భార్య క్యాన్సర్ పేషేంట్. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి’’ అంటూ నరేష్ తండ్రి చెన్నయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
రూల్స్ పాటించకుండా డిపో నిర్వహణ
ఆదిత్య టింబర్ డిపో ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. టింబర్ డిపోకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఐదేండ్ల క్రితం ఉదయ్ అనే వ్యక్తి స్థలం లీజ్ కు తీసుకుని.. టింబర్ డిపో నడిపిస్తున్నాడని దర్యాప్తులో గుర్తించారు. లేబర్ లైసెన్స్, ఫైర్ అనుమతులు పాటించకుండానే టింబర్ డిపో నడుపుతున్నట్లు గుర్తించారు. మెయిడ్ రోడ్డు పక్కన అపార్ట్ మెంట్స్ సమూహాల్లో టింబర్ డిపో రన్ చేస్తున్నాడని చెప్పారు. డిపో నిర్వాహకుడు ఉదయ్ ని అదుపులోకి తీసుకుని.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటా..? మరేదైనా కారణమా..? అనే కోణంలోనూ అరా తీస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు.
బాధిత కుటుంబానికి రూ.6 లక్షలు
కుషాయిగూడ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సహాయాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ప్రకటించారు.
కఠిన చర్యలు తప్పవు : మంత్రి మల్లారెడ్డి
మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంతో పాటు వారి కుమారుడు భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి టింబర్ డిపో నడుపుతున్న యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే జనావాసాల మధ్య ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ లకు సేఫ్టికి సంబంధించి నోటిసులు జారీ చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో జనావాసాల మధ్య ఉన్న టింబర్ డిపోల వివరాలను సేకరించి.. ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు.
ఘటనా స్థలానికి ప్రజాప్రతినిధులు
విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. అగ్నిప్రమాదంపై వివరాలు ఆరా తీశారు. ఇటు చర్చపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా వెళ్లారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు.. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ... ప్రమాదం గురించి ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.