
హైదరాబాద్లో ఘోరం జరిగింది. దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిల్డింగ్లోని లిఫ్ట్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని మర్డర్ చేసి లిఫ్ట్లో పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం డ్యూటీకొచ్చిన బ్యాంకు సిబ్బంది లిఫ్ట్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలిసిన వెంటనే.. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. హత్య జరిగిన తీరును చూస్తుంటే పాత పగలు మనసులో పెట్టుకుని అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు స్పష్టమవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైంది ఎవరు, హత్య చేసింది ఎవరనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు.