
‘‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు. పుట్టనేమి ! వాడు గిట్టనేమి ! పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా. విశ్వదాభిరామ వినురవేమ !’’ తల్లిదండ్రులపై ప్రేమ లేని కొడుకు బతికినా.. చచ్చినా పెద్ద నష్టం లేదు. పుట్టలో చెదలు పుడుతుంటుంది. చస్తుంటుంది. వేమన చెప్పిన ఇలాంటి కొడుకు ఏపీలోని విజయనగరంలో ఉన్నాడు. కన్న కొడుకుగా తల్లిదండ్రులపై ప్రేమ లేదు సరికదా.. ఒక మనిషికి కనీసం ఉండాల్సిన మానవత్వం, జాలి, దయ కూడా ఇతనికి లేవు. తోడబుట్టిన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనే కక్షతో తల్లిదండ్రులను అతి కిరాతకంగా ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపేశాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో ఈ అమానుష ఘటన జరిగింది.
తన చెల్లికి తల్లిదండ్రులు ఇచ్చిన పొలాన్ని ట్రాక్టర్తో రాజశేఖర్ చదును చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి అతని తల్లిదండ్రులు జయ (45), అప్పలనాయుడు (55) అక్కడికి వచ్చారు. ఆ పొలం చెల్లిదని ఎంత చెప్పినా వినకుండా తల్లిదండ్రులతో రాజశేఖర్ గొడవకు దిగాడు. ఈ గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. తల్లిదండ్రులపై కోపంతో రగిలిపోయిన రాజశేఖర్ ఆ పొలం తనకే చెందుతుందని వాగ్వాదానికి దిగాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా.. చంపొద్దని బతిమాలినా కోపోద్రేకంతో.. ట్రాక్టర్తో ఢీ కొట్టి అప్పలనాయుడు, జయను చంపేశాడు. కడుపులో పెట్టుకుని చూసుకున్న కన్న తల్లిదండ్రులను పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికులను విస్తుపోయేలా చేసింది.
►ALSO READ | లిఫ్ట్ ఇచ్చి, చోరీ చేసి.. 9 నెలలకు దొరికిన్రు..పుస్తెలతాడు అపహరణ కేసులో నలుగురు అరెస్ట్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్న ఓ కొడుకు చేసిన నిర్వాకం మరువక ముందే ఇలాంటి మరో ఘటన జరగడం గమనార్హం. ఆస్తి కోసం, ఆస్తిలో వాటా కోసం కని పెంచిన తల్లిదండ్రులపై కక్షలుకార్పణ్యాలతో కొడుకులు రగిలిపోతుండటంతో మానవ సంబంధాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మా తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి కూడా రాలేదు. ‘ఇల్లు నాకు కాకుండా చేశాడు. నేను అంత్యక్రియలకు రాను’ అని తెగేసి చెప్పాడు. ఇల్లు ఆయన పేరుపై రాస్తామని ఇద్దరు చెల్లెళ్లు బతిమిలాడినా, బంధుమిత్రులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. దీంతో చేసేదేంలేక చివరకు చిన్న కుమార్తెనే తండ్రి చితికి అగ్గిపెట్టి, అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది.