కాటారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేవరాంపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు. ఎస్సె అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారపాక సారయ్యకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తమ్ముడు సమ్మయ్య, మరో సోదరుడి భార్య లక్ష్మి మధ్య కొంత కాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టగా.. ఐదు గుంటల భూమిని సారయ్యకు ఇవ్వాలని తీర్పుచెప్పగా సమ్మయ్య, లక్ష్మి ఒప్పుకోలేదు.
శనివారం సారయ్య తన కొడుకు శ్రీరాంతో కలిసి వచ్చి దేవరాంపల్లిలో మరోసారి పంచాయితీ నిర్వహించగా, తమ్ముళ్ల కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు. దారి మధ్యలో తమ్ముడు, వారి కుటుంబీకులు మారుపాక సమ్మయ్య, అంజి, కిరణ్, లక్ష్మి, స్వప్న పక్కా ప్రణాళికతో కళ్లలో కారంపొడి చల్లి సుత్తి, గొడ్డలితో దాడి చేశారు. సారయ్యను మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. సారయ్య పెద్ద కొడుకు శ్రీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.