కోటి రూపాయల ఇంటి కోసం సవతి తల్లి ఘాతుకం.. హైదరాబాద్లో చంపి మూసీ వాగులో పాతిపెట్టింది..!

కోటి రూపాయల ఇంటి కోసం సవతి తల్లి ఘాతుకం.. హైదరాబాద్లో చంపి మూసీ వాగులో పాతిపెట్టింది..!

నల్లగొండ జిల్లా : శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసీ వాగులో యువతి మృత దేహాన్ని పోలీసులు వెలికితీశారు. మూడు నెలల క్రితం హైదరాబాదు నుంచి డెడ్ బాడీని తీసుకువచ్చి మూసీ వాగులో సవతి తల్లే యువతిని పాతిపెట్టింది. చనిపోయిన యువతి సొంత గ్రామం జనగామ జిల్లా దేవర ఉప్పల  మండలం పడమటి తండా (డి) గ్రామంగా పోలీసులు గుర్తించారు. యువతిని జటావత్ మహేశ్వరిగా నిర్ధారించారు.

మహేశ్వరి ఈనా నాయక్ మొదటి  భార్య కూతురు. ఈనా నాయక్ రెండో భార్య లలితనే మహేశ్వరిని చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మహేశ్వరిని హత్య చేయడానికి కారణాలు తెలిసి పోలీసులే విస్తుపోయారు. మహేశ్వరి వివాహానికి కోటి రూపాయల విలువ చేసే ఇంటిని తన బిడ్డకు కట్నం కింద ఇస్తానని ఆమె తండ్రి ఈనా నాయక్ ఒప్పుకున్నాడు. ఆ కోటి రూపాయల ఇల్లు తనకే కావాలని భావించిన ఈనా నాయక్ రెండో భార్య లలిత తన మేనబావ అయిన ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో గతేడాది (2024) డిసెంబర్ నెలలో మహేశ్వరిని హత్య చేసింది.

Also Read:-హిందూ-ముస్లిం ఫ్రెండ్షిప్ ఏంటి.. సిగ్గులేదా..? పార్కులో జంటపై యువకుల దాడి

వంగమర్తి దగ్గర మూసీ వాగులో మహేశ్వరి మృతదేహాన్ని సవితి తల్లి లలిత పాతిపెట్టింది. డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి స్వగ్రామానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. తనకు దక్కాల్సిన ఆస్తిని పెళ్లి పేరుతో మహేశ్వరి తీసుకుపోతుందని కోపంతో జీర్ణించుకోలేక ఈ హత్య చేసినట్లు ఈనా నాయక్ రెండో భార్య లలిత పోలీసుల విచారణలో నేరం అంగీకరించింది. పోలీసులు లలితను అరెస్ట్ చేశారు. మహేశ్వరిని హత్య చేయడంలో లలితకు సహకరించిన వాళ్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఈ హత్యలో భాగమైన మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.