
కొల్చారం/చిలప్‌చేడ్, వెలుగు: రెండో పెండ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందన్న కారణంతో ఓ మహిళ తన తల్లిదండ్రులతో కలిసి నాలుగు నెలల కూతురిని హత్య చేసింది. తర్వాత కేసు నుంచి తప్పించుకునేందుకు మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయగా.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి గురువారం వెల్లడించారు. మెదక్ జిల్లా చిలప్‌చేడ్ మండలంలోని టోప్యా తండాకు చెందిన గాయత్రికి, కొల్చారం మండలం వరిగుంతం సీతారం తండాకు చెందిన రాజుతో రెండేండ్ల కింద పెండ్లి జరిగింది.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతుండడంతో గాయత్రి తన నాలుగు నెలల కూతురు అమ్ములుతో కలిసి తల్లి గారి ఇంటికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో తమ కూతురు, మనుమరాలు మార్చి 20 నుంచి కనిపించడం లేదంటూ గాయత్రి తల్లిదండ్రులు దీప్లా, భూలి 28న కొల్చారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు.
అయితే గురువారం గాయత్రి కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. అమ్ములును తానే చంపి చిట్కుల్ చాముండేశ్వరి గుడి వద్ద మంజీరా నదిలో పడేసినట్లు ఒప్పుకుంది. గాయత్రికి భర్త రాజుతో విడాకులు ఇప్పించి మళ్లీ పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారని, ఇందుకు చిన్నారి అడ్డుగా ఉందన్న ఉద్దేశంతోనే హత్య చేసినట్లు సీఐ వివరించారు. ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.