మహిళ ప్రాణం ఖరీదు రూ.20 లక్షలు.. వైద్యం వికటించడంతో హాస్పిటల్ యాజమాన్యం ఒప్పందం

మహిళ ప్రాణం ఖరీదు రూ.20 లక్షలు.. వైద్యం వికటించడంతో హాస్పిటల్ యాజమాన్యం ఒప్పందం
  • వైద్యం వికటించడంతో హాస్పిటల్ యాజమాన్యం ఒప్పందం

చేవెళ్ల, వెలుగు: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందగా, ఆమె ప్రాణాలకు హాస్పిటల్ యాజమాన్యం ఖరీదు కట్టింది. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అంగడి చిట్టెంపల్లికి చెందిన మమత (25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఇటీవల చేవెళ్లలోని పట్నం మహేందర్​రెడ్డి​ హాస్పిటల్లో చేరింది. ఈ నెల 12న ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత బాధితురాలికి జ్వరం వస్తుండడంతో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారు. అయితే, ఆదివారం ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీశారు.

దీంతో సిటీలోని ఇతర హాస్పిటల్కు రిఫర్ చేయగా, అంబులెన్స్లో అక్కడికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి సోమవారం రాత్రి మమత మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకొని వచ్చి పీఎంఆర్ ఆసుపత్రి ముందు మంగళవారం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మమతకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్​ చేయడంతో హాస్పిటల్ యాజమాన్యం దిగొచ్చింది. న్యాయం చేస్తామని చెప్పి, రూ. 20 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో బాధితులు ధర్నాను విరమించారు.