- ప్రేమ పేరుతో వేధింపులు.. యాసిడ్ తాగి యువతి సూసైడ్
- మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఘటన
- నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీఎస్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
జవహర్ నగర్, వెలుగు: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏసీపీ మహేశ్‌కుమార్ వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని దమ్మాయిగూడ న్యూ భవాని నగర్ కాలనీకి చెందిన పొన్నగంటి తానేశ్, పద్మ దంపతులు. వీరి కూతురు పూర్ణిమ(19) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్చదువుతోంది. ఈ నెల 24న కాలేజీకి నుంచి ఇంటికి వచ్చిన పూర్ణిమ పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. ఈ క్రమంలోనే వాష్ రూమ్‌లోకి వెళ్లి యాసిడ్ తాగింది. ఆ తర్వాత యాసిడ్ తాగినట్లు పిల్లలకు చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
నిఖిల్ అనే యువకుడి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఏ ఆడబిడ్డకు జరగకుండా, నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షపడేలా చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.