
హైదరాబాద్: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన మీర్పేట్ గురుమూర్తి ఘటన వెలుగుచూసిన నెలల వ్యవధిలోనే మరో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి, గుండె పోటు కథ అల్లిన భర్త ఉదంతం హైదరాబాద్లోని చాదర్ఘాట్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓల్డ్ మలకపేట జమున టవర్స్లో సింగం శిరీష, వినయ్ కుమార్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. శిరీష స్వగ్రామం శ్రీశైలం సమీపంలోని దోమలపేట. శిరీష జమున టవర్స్లోని తన నివాసంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గుండెపోటు అని శిరీష తల్లిదండ్రులకు కాల్ చేసి ఆమె భర్త వినయ్ సమాచారం ఇచ్చాడు.
శిరీష కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే ఆమె మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలోని దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెబుతున్నారని.. శిరీష భర్త గుండెపోటు కథ అల్లాడని చాదర్ ఘాట్ పోలీసులకు శిరీష కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తన కూతురును అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడని శిరీష కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనతో ఓల్డ్ మలకపేటలోని జమున టవర్స్ ఉలిక్కిపడింది.
మీర్పేట్ గురుమూర్తి ఉదంతం వెలుగుచూసిన నెలల వ్యవధిలోనే ఇలాంటి మరో ఘటన జరగడం గమనార్హం. చిన్న చిన్న గొడవల కారణంగానే తన భార్య పుట్ట వెంకటమాధవిని నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారం హత్య చేశాడని గురుమూర్తి కేసులో పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం శిక్ష పడకుండా ఉండేలా ఆధారాలు దొరకకుండా చేయాలనే తన భార్య డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి డిస్పోజ్ చేసినట్టు గుర్తించారు.
Also Read : ఇలాంటి కొడుకునా ఆ తల్లి నవమాసాలు మోసింది
వెంకటమాధవి డెడ్ బాడీని ఎలాంటి ఆధారాలు లేకుండా మాయం చేసి, కేసును డైవర్ట్ చేయాలని గురుమూర్తి భావించాడు. ఒకవేళ పోలీసులు హత్య అని గుర్తించినా.. ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని అనుకున్నాడు. ముందుగా డెడ్ బాడీని బాత్ రూంలోకి తీసుకెళ్లాడు. కండ్లు, ఆ తర్వాత చేతులు, మెడ వేరు చేశాడు. ఎముకల నుంచి మాంసం కోశాడు. తర్వాత మాంసం ముద్దలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బకెట్ లో వేసి హీటర్ పెట్టి బాయిల్ చేశాడు. ఆ నీటిని టాయిలెట్ కుండీలో వేసి ఫ్లష్ చేశాడు. తర్వాత మాంసం ముక్కలను స్టవ్ పై కాలుస్తూ బొగ్గుగా మార్చాడు.
ఆ బొగ్గు ముక్కలను కూడా టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేశాడు. తర్వాత ఎముకలను రోలు, రోకలితో దంచి పిండిగా మార్చి, పక్కకు పెట్టాడు. అనంతరం రూమ్ ను డిటర్జెంట్, ఫినాయిల్, యాసిడ్ తో క్లీన్ చేశాడు. ఆ తర్వాత ఎముకల పిండిని బకెట్ లో తీసుకుపోయి జిల్లెలగూడ సందె చెరువులో కలిపేశాడు. ఉదయం 8 గంటలకు భార్యను హత్య చేసిన గురుమూర్తి.. సాయంత్రం 6 గంటలకల్లా పది గంటల్లోనే డెడ్ బాడీని డిస్పోజ్ చేశాడని పోలీసులు వెల్లడించారు.