- డబ్బుల కోసం బాలిక బంధువు బ్లాక్ మెయిల్ చేయడమే కారణం
- ఘట్కేసర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఘటన
- సూసైడ్ కు ముందు తన పేరెంట్స్ కు వాట్సాప్ లో యువకుడి మెసేజ్
ఘట్కేసర్, వెలుగు: తను ప్రేమించిన అమ్మాయి తరపు బంధువు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమీలపేటకు చెందిన పర్వతం శ్రీరామ్ (25) పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లిలో సైకిల్ షాప్ నిర్వహిస్తున్నాడు. శ్రీరామ్, అతని దుకాణం పక్కన ఉండే ఓ బాలిక ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ వ్యవహారం బాలిక దగ్గరి బంధువు చింటూకు తెలిసింది. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరి ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని బాలికను చింటూ 15 రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె శ్రీరామ్ కు చెప్పడంతో చింటూకు శ్రీరామ్ రూ.1.35 లక్షలు ఇచ్చాడు. మరిన్ని డబ్బులు కావాలని బెదిరిస్తుండడంతో డబ్బు ఇచ్చేందుకు శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. సోమవారంఉదయం 10 గంటలకు శ్రీరామ్.. బోడుప్పల్‌కు చెందిన తన స్నేహితుడు నవీన్ వద్ద కారు తీసుకుని బాలికతో కలిసి వెళ్లాడు. సాయంత్రం ఘనాపూర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో కారులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
కారులో మంటలకు తాళలేక శ్రీరామ్ బయటకు వచ్చి పరిగెత్తాడు. ఫుట్‌పాత్‌పై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డోర్ లాక్ కావడంతో బాలిక బయటకు రాలేక అందులోనే సజీవ దహనమైంది. అటువైపు వచ్చిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. చింటూ బ్లాక్మెయిల్ చేయడం వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని శ్రీరామ్ అంతకుముందు సూసైడ్ నోట్ రాసి బాలిక తల్లిదండ్రులకు, అతని అన్న కొడుకుకు వాట్సాప్ చేశాడు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఘట్కేసర్ సీఐ పరశురాం తెలిపారు.