తల్లిని చంపిన కొడుకు.. హనుమకొండ జిల్లా వీరనారాయణపూర్‌‌లో దారుణం

తల్లిని చంపిన కొడుకు.. హనుమకొండ జిల్లా వీరనారాయణపూర్‌‌లో దారుణం

ఎల్కతుర్తి, వెలుగు: చెప్పిన మాట వినడం లేదని తల్లి మందలించడంతో ఆగ్రహానికి గురైన యువకుడు ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్‌‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వీరనారాయణపూర్‌‌ గ్రామానికి చెందిన చదిరం కుమారస్వామి-, రేవతి (40) దంపతులకు అజయ్, విజయ్ కుమారులు ఉన్నారు. కుమారస్వామి పదిహేనేండ్ల కింద చనిపోయాడు. రేవతి, అజయ్ కూలి పనులు చేస్తూ గ్రామంలోనే ఉంటుండగా, విజయ్‌‌ హైదరాబాద్‌‌లో ప్రైవేట్‌‌ జాబ్‌‌ చేస్తున్నాడు.

అజయ్‌‌ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని రెండేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నాడు. తల్లి రేవతికి కొడుకుతో పాటు కోడలితో తరచూ గొడవలు జరుగుతుండడంతో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం సాయంత్రం రేవతి, అజయ్‌‌ మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అజయ్‌‌ గొడ్డలితో తల్లిపై దాడి చేశాడు. మెడ భాగంలో తీవ్రంగా గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు అజయ్‌‌ పరారీలో ఉన్నాడని ఎస్సై ప్రవీణ్‌‌కుమార్‌‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.