- ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేసిన బాధితురాలి స్నేహితుడు
- గుడికి పోదామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు
- హోటల్ లో లంచ్ అని ఓయో రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం
- విషయాన్ని పోలీసులకు చెప్పని లాడ్జి నిర్వాహకులు
- బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు: తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఓ యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు వరంగల్ జిల్లాలో బొల్లికుంటలోని ఓ కాలేజీలో చదువుతోంది. భూపాలపల్లి హనుమాన్‌నగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు తాటి శివరాజ్‌కుమార్.. నర్సంపేట లక్నేపల్లిలోని బిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతనికి గోదావరిఖనికి చెందిన కూచన మణిదీప్, కొడం వివేక్ మిత్రులుగా ఉన్నారు. ఈ క్రమంలో శివరాజ్‌కు భూపాలపల్లికి చెందిన పుట్టపాక శరత్ అనే స్నేహితుడి ద్వారా మూడేండ్ల క్రితం బాధితురాలు పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత శివరాజ్ ఆమెపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. ఫ్రెండ్ గా మాత్రమే ఉంటానని చెప్పింది. అప్పటి నుంచి బాధితురాలిపై శివరాజ్ కక్ష పెంచుకున్నాడు.
ప్లాన్ చేసి సామూహిక అత్యాచారం
ఈ క్రమంలో శివరాజ్, మణిదీప్, వివేక్.. ఆ యువతిపై రేప్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం ఆగస్టు 15వ రోజే ముగ్గురూ కలిసి మణిదీప్ కారులో బొల్లికుంటలోని బాధితురాలు చదివే కాలేజీ వద్దకు చేరుకున్నారు. ‘‘నీ కోసం వచ్చాను. ఏదైనా టెంపుల్‌కు వెళ్దాం” అని శివరాజ్ యువతికి చెప్పి బయటకు రమ్మన్నాడు. బాధితురాలు కారు వద్దకు వచ్చాక మరో ఇద్దరు ఉండటాన్ని గమనించింది. దీంతో శివరాజ్ వెంట వెళ్లడానికి నిరాకరించింది. వారిద్దరు తన క్లోజ్ ఫ్రెండ్స్ అని, అందరం కలిసి గుడికి వెళ్దామని, తర్వాత లంచ్ చేద్దామని శివరాజ్ ఆ యువతిని బలవంతంగా తీసుకువెళ్లాడు. నిందితులు మధ్యలో బీర్లు కొనుగోలు చేశారు. హోటల్ లో లంచ్ అని చెప్పి వరంగల్ బస్టాండ్ సమీపంలోని ఓయో లాడ్జిలోకి ఆమెను తీసుకువెళ్లారు. ముందస్తు స్కెచ్ ప్రకారం నిందితులు ఆమెను బెదిరించి గ్యాంగ్ రేప్ చేశారు.
యువతి గట్టిగా అరవడంతో లాడ్జి సిబ్బంది గది వద్దకు వచ్చి వారితో రూం ఖాళీ చేయించారు. కాగా, ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామని యువతిని నిందితులు హెచ్చరించారు. ఈ విషయం తెలిస్తే నీ పరువే పోతుందని బెదిరించారు. అదే సమయంలో కాలేజీలో ఎగ్జామ్స్ ఉండడంతో బాధితురాలు విషయాన్ని మనసులోనే పెట్టుకుంది. పరీక్షలు పూర్తయ్యాక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది. ఈ నెల 1న వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం లక్నేపల్లిలోని బిట్స్ కాలేజీ ప్రాంతంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, ఇంతేజార్ గంజ్ సీఐ శివకుమార్ తెలిపారు. ఆ ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.