సమాజం ఎటుపోతుంది.. మనుషులు మనుషుల మధ్య ఏమీ లేదా.. చుట్టుపక్కల వాళ్ల మాట కూడా కరువే అయ్యింది.. సిటీ జీవితం అంటే ఎవరికి వారేనా.. ఎవరి బతుకు వాళ్లదేనా.. ఇంటి పక్కనోళ్లు కూడా పరాయివాళ్లేనా.. రోజూ కనిపించే మనిషి కనిపించకపోతే పట్టించుకునే నాథుడే లేదా.. ఇంత దారుణంగా ఉందా సిటీలోని పరిస్థితులు.. దీనికి కారణం లేకపోలేదు.. సికింద్రాబాద్ వారాసిగూడలో వెలుగులోకి వచ్చిన ఘటన.. అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. తల్లి చనిపోయి వారం రోజులు అవుతుంటే.. అంత్యక్రియలకు డబ్బులు లేక ఇంట్లోనే వారం రోజులు.. తల్లి శవంతో గడిపిన ఆ ఇద్దరు పిల్లల మానసిక పరిస్థితి ఏంటీ.. ఎలా ఉన్నారు అనేది తలచుకుంటేనే సిటీ జనానికి ఒళ్లు జలదరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
సికింద్రాబాద్లోని వారాసిగూడ పీఎస్ పరిధి బౌద్దనగర్లో లలిత (45) తన ఇద్దరు కూతుర్లు రవళిక (25), అశ్విత (23)తో కలిసి నివాసం ఉంటుంది. కరోనా సమయంలో లలిత భర్త కుటుంబాన్ని వదిలి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరు ఆడకూతుర్ల బాగోగులు లలితనే చూసుకుంటుంది. ఈ క్రమంలోనే లలిత అనారోగ్యానికి గురి అయ్యింది. ట్రీట్మెంట్ చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో అలాగే ఇంట్లో ఉంటుంది.
దీంతో ఆరోగ్యం మరింత విషమించి 2025, జనవరి 23న అంటే తొమ్మిది రోజుల క్రితం లలిత మరణించింది. తల్లి మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిన కూతుర్లు.. దహణ సంస్కారాలకు డబ్బులు లేక తల్లి మరణవార్తను ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా లలిత మృతి చెంది ఉంది.
కూతుళ్లను ప్రశ్నించగా.. జనవరి 23వ తేదీన తమ తల్లి చనిపోయిందని.. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. మొదట ఖంగుతున్న పోలీసులు.. చివరకు అర్థం చేసుకుని లలిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తల్లి శవంతోటే ఇద్దరు కూతుర్లు తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఉన్నారన్న విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లలిత మృతికి గల కారణం ఏంటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.