
సికింద్రాబాద్: రైలు వాష్ రూమ్లో ఓ బాలికను లైంగికంగా వేధించిన ఒక కామాంధుడు ఆ దుశ్చర్యను వీడియో తీశాడు. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిస్సాకు చెందిన ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రక్జౌల్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో జర్నీ చేస్తున్నాడు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆ ఫ్యామిలీలోని బాలిక ట్రైన్లోని వాష్ రూమ్కి వెళ్ళింది. ఆ సమయంలో ఆ బాలిక కుటుంబంతో పాటు బోగీలోని వాళ్లు నిద్రిస్తున్నారు.
అదే బోగీలో డోర్ దగ్గర ఉన్న ఒక కామాంధుడు ఆ బాలిక వాష్ రూంకు వెళ్తున్న క్రమంలో ఆమె నోరు నొక్కి బలవంతంగా వాష్ రూంలోకి తీసుకెళ్లి లోపల లాక్ చేశాడు. ఆమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ దుశ్చర్యను వీడియో తీశాడు. ఈ విషయం బయటపెడితే చంపేస్తానని ఆ బాలికను నిందితుడు బెదిరించి వదిలేశాడు. అయితే ఆ బాలిక ధైర్యం చేసి వాష్ రూం నుంచి బయటకు వచ్చిన వెంటనే జరిగిన అమానుషాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరైంది.
సదరు నిందితుడిని పట్టుకొని పరిశీలించగా వీడియోలు బయటపడ్డాయి. దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139కు ఫోన్ చేసి సదరు బాలిక విషయం చెప్పింది. గురువారం ఉదయం సికింద్రాబాద్కు ట్రైన్ చేరుకున్నాక బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కెల్జార్ స్టేషన్ దాటుతున్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో బాలిక తండ్రి పేర్కొన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోక్సోతో పాటు పలు సెక్షన్ కింద సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.