కొడుకు ప్రేమించిండని.. తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు!

కొడుకు ప్రేమించిండని.. తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు!
  • యువతి కుటుంబసభ్యులు, బంధువుల అమానుషం
  • గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేములలో ఘటన

 ఇటిక్యాల/గద్వాల, వెలుగు: కొడుకు ప్రేమించిండని అతని తల్లిని యువతి కుటుంబసభ్యులు, బంధువులు చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటిక్యాల మండలం వేములలో వేర్వేరు కులాలకు చెందిన యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నారు.

ఇరు కుటుంబాలకు తెలియడంతో వారి పెండ్లికి నిరాకరిస్తూ వస్తున్నారు. కొంతకాలం కింద ప్రేమికులు పారిపోయారు. అప్పట్లో వనపర్తి పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. మళ్లీ కొద్ది రోజులకు తిరిగి ఇంటికి వెళ్లారు. ప్రేమికులు ఎవరింట్లో వారు ఉంటున్నారు. నెలరోజుల కింద మరోసారి ఇద్దరూ కర్నూలు వెళ్లి అక్కడి నుంచి ఎటో వెళ్లిపోగా కర్నూలు టూ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది.

దీంతో భయపడిన అబ్బాయి కుటుంబసభ్యులు ఊరు విడిచి వెళ్లిపోయారు. రెండు రోజుల కింద తిరిగి వచ్చారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లి యువకుడి ఇంటిపై దాడి చేశారు. అతని తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రేమికులు ఎక్కడున్నారో చెప్పాలంటూ హింసించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వెళ్లి బాధిత మహిళ కట్లను విప్పి స్టేషన్​కు తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కోదండపురం ఎస్ఐ మురళి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.