
తల్లహస్సీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తల్లహస్సీలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(ఎఫ్‌ఎస్‌యూ)లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడింది అదే వర్సిటీ విద్యార్థి ఫీనిక్స్ ఇక్నర్ అని, స్థానిక డిప్యూటీ షెరీఫ్(పోలీస్‌ఆఫీసర్) కొడుకు అని పోలీసులు గుర్తించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని అతడిని గాయపరిచి అదుపులోకి తీసుకున్నారు.
ఇక్నర్ గురువారం మధ్యాహ్నం పోలీస్ ఆఫీసర్ అయిన తల్లి సర్వీసు గన్ను తీసుకొని యూనివర్సిటీకి వచ్చాడు. అక్కడ తనకు ఎదురొచ్చిన స్టూడెంట్లపై కాల్పులు జరిపారు. సుమారు ఎనిమిది నుంచి 10 రౌండ్లు షూట్‌చేశాడు. దీంతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. విషయం తెలియగానే అక్కడకు వచ్చిన పోలీసులు లాన్లో తుపాకీతో సంచరిస్తున్న ఇక్నర్ను లొంగిపోవాలని కోరారు. అయినా వినకపోవడంతో షూట్ చేశారు.
ఇక్నర్ నుంచి గన్ స్వాధీనం చేసుకొని.. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. స్థానిక షెరీఫ్ వాల్ట్ మెక్నీల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్నర్ తల్లి పోలీస్ ఆఫీసర్ కావడంతో గతంలో షెరీఫ్ ఆఫీస్ కోచింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడని తెలిపారు. మరోవైపు 40 వేల మందికి పైగా విద్యార్థులుండే ఫ్లోరిడా స్టేట్యూనివర్సిటీలో కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో యూనివర్సిటీలో అన్ని క్లాసులు రద్దు చేశారు. స్టూడెంట్లంతా క్యాంపస్ నుంచి ఇండ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు.
విమానంలో హైజాకర్ కాల్చివేత
బెల్మోపాన్: సెంట్రల్ అమెరికా తూర్పు తీర దేశమైన బెలిజ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అమెరికన్ (49) ప్యాసింజర్లతో కూడిన విమానం గాలిలో ఉండగా హైజాక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ప్లేన్ లోని ఒక ప్యాసింజర్ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్ తో కాల్పులు జరపడంతో హైజాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో పైలట్‌తోపాటు ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.