భూదాన్ పోచంపల్లి, వెలుగు : భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో వస్త్ర దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీ చేసి ఇక్కత్ చీరలను నకిలీ అని తేల్చడంపై భూదాన్ పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ సభ్యులు, షాపు యజమానులు నిరసన తెలియజేశారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని అన్ని వస్త్ర దుకాణాలను మూసివేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
భూదాన్ పోచంపల్లిలో నకిలీ ప్రింటెడ్ చీరలు ఎక్కడా లేవని, విజిలెన్స్ అధికారులు చూపించిన చీరలు హ్యాండ్లూమ్ లోనే పవర్ లూమ్స్ లో చేసినవని చెప్పారు. అధికారులు అవగాహన లేకుండా నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. పోచంపల్లికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఖ్యాతి ఉందనే అవగాహన కూడా లేకుండా అధికారులు చేసిన తనిఖీలతో ఆ ఖ్యాతి దెబ్బతిన్నదని వాపోయారు. అవగాహన రాహిత్యంతో స్టేట్ మెంట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రింటెడ్ చీరలు హైదరాబాద్ లోని మదీనా లాంటి సెంటర్లలో అధికంగా చలామణి అవుతున్నాయని, వాటిపై దృష్టి సారించాలని సూచించారు.