బస్ స్టేషన్లలోని స్టాల్స్ లోనూ అమ్మకాలు.. లాక్డౌన్లో మిగిలినవి అంటగడుతున్నరు
తింటే ప్రాణాలు పోతాయంటున్న డాక్టర్లు
ఎక్కడా తనిఖీలు చేయని అధికారులు
అజయ్ అనే వ్యక్తి శుక్రవారం జగిత్యాల కొత్త బస్టాండ్ లోని ఓ స్టాల్ లో బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. డౌట్ వచ్చి ప్యాకెట్ పై చూడగా ఇరవై రోజుల క్రితమే ఎక్స్ పైరీ అయినట్టు ఉంది. స్టాల్ యజమానిని అడిగితే ‘మేమే కాదు చాలామంది అమ్ముతున్నరు. ఏమైతది’ అని సమాధానం చెప్పడంతో అధికారులకు కంప్లయింట్ చేస్తా అని వెళ్లిపోయాడు.
జగిత్యాల, వెలుగు: బయటకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు బిస్కెట్స్, చిప్స్, రింగ్స్ కోసం ఏడుస్తూ ఉంటారు. వారిని ఊకోపెట్టేందుకు తల్లిదండ్రులు అడిగినవన్నీ కొనిస్తూ ఉంటారు. కానీ ఇలా కొనిపెట్టేముందు అందరూ ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలా షాపుల్లో, సూపర్ బజార్లలో ఎక్స్ పైరీ అయిన ఐటమ్స్ అంటగడుతున్నారు. ఇందులో ఫుడ్ ఐటమ్స్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అవి తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
లాక్ డౌన్ లో మిగిలిన స్టాక్
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 23 నుంచి లాక్ డౌన్ విధించాయి. అప్పటినుండి 3 నెలలపాటు దుకాణాలు, సూపర్ బజార్లు, ఇతర షాపులు మూతపడ్డాయి.ఈ టైంలో పలు పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. అప్పటివరకు తయారు చేసిన ప్రొడక్టులను అలానే ఉంచాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఆ ఉత్పత్తులన్నీ మార్కెట్లకు వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని పరిశ్రమలు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రొడక్టులను పంపిస్తున్నట్టు సమాచారం. అలాగే లాక్డౌన్ టైంలో బంద్ ఉన్న పలు దుకాణాలు, సూపర్ బజార్లు తెరుచుకోగా అందులోని పాత ఐటమ్స్ కస్టమర్లకు అంటగడుతున్నారు. ఇందులో చిన్న పిల్లలు కూడా తినే బిస్కెట్స్, చిప్స్, నూడుల్స్ ఉంటున్నాయి. మామూలుగా ఫుడ్ ఐటమ్స్ కాల పరిమితి తక్కువగా ఉంటుంది. నూడుల్స్, బిస్కెట్స్ లాంటివి 6 నెలల వరకు ఉపయోగించవచ్చు. షాపుల్లో ప్రతి ఐటమ్ 3, లేదా 4 నెలల్లో అమ్ముడుపోతాయి. లాక్ డౌన్ 3 నెలలు ఉండడంతో షాపుల్లో ఉంచిన స్టాక్
అలాగే ఉండిపోయింది. దీంతో షాప్ యజమానులు తాము నష్టపోతామన్న కారణంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చాలామంది కొనుక్కుని పోతారు కాని ఎక్స్పైరీ డేట్ సంగతి పట్టించుకోరు. ఈ విషయాన్ని పసిగట్టి ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్ స్టాక్ లో కలిపి అమ్మేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా బస్స్టేషన్లలో..
ఉమ్మడి జిల్లాలోని పలు షాపులతో ముఖ్యంగా బస్టాండ్లలో ఎక్స్పైరీ అయిన ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నట్టు సమాచారం. జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపెల్లి, గోదావరిఖని, మంథని బస్టాండ్లలో ఈ దందా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు క్వాలిటీ లేని బిస్కెట్లు, ఎక్కడా కనిపించని చాక్లెట్లు, వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. బస్సుల్లో వచ్చినప్పుడు జర్నీ చేసే తొందరలో ఉంటారు కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా కొనుక్కుపోతారని ఇలా చేస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువగా
అంటగడుతున్నారు.
డేట్ చూసి అమ్మాలి
ఎక్స్పైరీ అయిన ఏ ఐటమ్ అమ్మకూడదు. 15 రోజులే కదా… నెల రోజులే కదా… అమ్మితే ఏమవుతుంది అనే ఆలోచనతో ఉండొద్దు. అవి ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తాయి. షాప్స్ యజమానులు కచ్చితంగా డేట్ చూసి అమ్మాలి. ఎక్స్పైరీ అయిన ఫుడ్ ఐటమ్స్ అమ్మితే మా దృష్టికి
తీసుకురండి. తనిఖీలు చేసి షాపులు సీజ్ చేస్తాం.
-అమృతశ్రీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, జోనల్ ఆఫీసర్
ప్రాణాలు పోతాయ్
ఎక్స్పైరీ అయిన ఫుడ్ ఐటమ్స్ తింటే ఎలర్జీతో పాటు కడుపుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కచ్చితంగా డేట్ చూసే కొనుక్కోవాలి. లేకపోతే ముప్పు తప్పదు.
-శ్రీధర్ పుప్పాల, డీఎంహెచ్ఓ , జగిత్యాల
For More News..