హైదరాబాద్ శుభ నందిని చిట్ఫండ్ బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్.. మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం మూడవ అంతస్తులో ఉన్న శుభ నందిని చిట్ఫండ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. శుభనందిని చిట్ఫండ్ బోర్డు తీసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయి ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకున్నారు. నాచారం పోలీసులు ఘటనా స్థలానికి  చేరుకున్నారు.

అగ్నిమాక సిబ్బంది ఫాగ్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశారు. అంతలోపే మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో విషాదం నెలకొంది. చనిపోయిన వ్యక్తులను ఇనుగుర్తి  గ్రామం కేసముద్రం మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన జటోతు బాలు (37), సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తికి చెందిన మల్లేష్గా(27) పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.