ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం,వెలుగు: ఐటీడీఏ నిధులతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన కిచెన్​షెడ్, బ్లడ్​బ్యాంక్​ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని పీవో గౌతమ్ పోట్రు ఆదేశించారు. మంగళవారం తన చాంబర్​లో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.రవిబాబుతో పీవో రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇల్లందు, అశ్వారావుపేట ప్రాంతీయ ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి పీవో అంగీకరించారు. సీజనల్​ వ్యాధుల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని, అవసరమైన మందులు ముందుగానే తెచ్చి పెట్టుకోవాలని సూచించారు. నెలలు నిండిన గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ముందుగానే తీసుకురావాలని కోరారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్​ డా.రామకృష్ణ, ఐటీడీఏ ప్రోగ్రాం మేనేజర్​ రాముడు పాల్గొన్నారు.

ఆర్టీసీకి దసరా ఆదాయం రూ.1.53 కోట్లు

ఖమ్మం టౌన్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఖమ్మం ఆర్టీసీ రీజియన్ లో రూ.1, 53,84, 926 ఆదాయం వచ్చినట్లు ఖమ్మం ఆర్టీసీ రీజియన్  మేనేజర్  ఎం.ఎస్తేర్  ప్రభులత తెలిపారు. రీజియన్​లోని ఆరు డిపోల నుంచి గత నెల 24 నుంచి ఈ నెల 4 వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు, ఈ నెల 6 నుంచి 10 వరకు  ఖమ్మం నుంచి హైదరాబాద్ కు 669 ప్రత్యేక బస్సులను నడిపినట్లు చెప్పారు. 3,69,579 కిలోమీటర్లు బస్సులు తిరిగినట్లు తెలిపారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గ్రీన్ ఫీల్డ్  హైవే​ సర్వేను అడ్డుకున్న రైతులు

మధిర, వెలుగు: పంట పొలాల్లో నుంచి వెళ్తున్న నాగపూర్–అమరావతి గ్రీన్ ఫీల్డ్  హైవే సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను చింతకాని మండలం వందనం, కొదుమూరు, అర్బన్  మండలం రైతులు అడ్డుకున్నారు. మంగళవారం ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్​ మంగీలాల్, హైవే ఆఫీసర్లు సర్వే చేసేందుకు వచ్చారు. వారిని అడ్డుకున్న రైతులు హైవేకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు మాట్లాడుతూ రైతులతో ముందుగా మాట్లాడకుండా అధికారులు సర్వే చేసేందుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. భూమి కోల్పోతున్న రైతులకు సరైన హామీ ఇచ్చి రైతుల అంగీకరిస్తేనే సర్వే చేయాలని అన్నారు. బాధిత రైతులు వేముల సతీశ్, నవీన్ రెడ్డి, భద్రయ్య, నాగండ్ల శ్రీధర్, ప్రతాపనేని వెంకటేశ్వర్లు,  జేఏసీ నాయకులు పెంట్యాల వెంకటేశ్వర్లు, వీరబాబు, నారపోగు శ్రీను, కొండా శంకర్, చిట్టిమోదు చిన్న లింగ, ఎల్నాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలి

మధిర, వెలుగు: రాష్ట్రంలోనే అత్యధికంగా దళితులు ఉన్న మధిర నియోజకవర్గంలో అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్​ చేశారు. మంగళవారం తహసీల్దార్​ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. తహసీల్దార్​కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్​ చేశారు. భట్టి విక్రమార్క టీఆర్ఎస్  పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. బీజేపీ నాయకులు గెల్లా సత్యనారాయణ, పెరుమాళ్లపల్లి విజయ్​రాజు, చిలివేరు సాంబశివరావు, రామిశెట్టి నాగేశ్వరరావు, ఏలూరు నాగేశ్వరరావు, నరసింహారావు, కుంచం కృష్ణారావు, రామయోగేశ్వరరావు పాల్గొన్నారు. 

పారిశ్రామిక వేత్తలకు మూడు రోజుల వర్క్​షాప్

భద్రాచలం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాపారాలు చేస్తున్న  గిరిజన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు వర్క్ షాప్​ నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ధిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించుకునేలా శిక్షణ​ఇవ్వనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలు అవసరమైన సర్టిఫికెట్లతో గిరిజన భవనానికి రావాలని కోరారు.

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా  చూడాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కనీస మద్దతు ధర, పత్తి నాణ్యత ప్రమాణాలపై రూపొందించిన పోస్టర్లను రిలీజ్​ చేశారు. మార్కెట్ యార్డులలో వ్యవసాయ ఉత్పత్తులను శుభ్రం చేసేందుకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే మిషన్లు, ఎలక్ట్రానిక్​ కాంటాలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మార్కెటింగ్​ ఆఫీసర్​ అలీం, డీఏవో అభిమన్యుడు, ఉద్యానవన శాఖాధికారి మరియన్న, సీపీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్​ ఆవరణలోని ఈవీఎం, వీవీప్యాట్​లు భద్రపరిచిన గోదామ్​ను కలెక్టర్​ తనిఖీ చేశారు. డీఆర్వో అశోక్​ చక్రవర్తి, ఏవో గన్యా, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్​ ఎంఏ రాజు, సిబ్బంది నవీన్​ పాల్గొన్నారు. 

ఈజీఎస్ రికార్డులు అప్​డేట్ చేయాలి

ఎర్రుపాలెం,వెలుగు: ఎన్ఆర్ ఈజీఎస్ కార్డుల రికార్డులను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేయాలని డీఆర్డీవో విద్యాచందన ఆదేశించారు. మండలంలోని బనిగండ్లపాడు, ఎర్రుపాలెం, కండ్రిక గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం రిజిస్టర్లను, కూలీల జాబ్ కార్డులు, వేతనాలచెల్లింపు తదితర రికార్డులను పరిశీలించారు. టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేసి జాబ్ కార్డులను అప్​డేట్ చేయాలని సూచించారు. అడిషనల్  డీఆర్డీవో శిరీష, ఏపీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీవో నాగరాజు టీఏలు విజయలక్ష్మి, కాంతమ్మ, లక్ష్మయ్య, సెక్రటరీలు నాగేశ్వరావు, శ్రావణి, రాధాకృష్ణ పాల్గొన్నారు.
 

సర్పంచ్​కు సన్మానం

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న ఏన్కూరు మండలం నూకలంపాడు సర్పంచ్  ఇంజం శేషగిరిరావును మంగళవారం ఖమ్మంలోని తన స్వగృహంలో ఎంపీ నామా నాగేశ్వరరావు శాలువాతో సన్మానించారు. రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

స్కానింగ్​ సెంటర్లలో రూల్స్​ పాటించాలి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: స్కానింగ్​ సెంటర్ల​నిర్వాహకులు రూల్స్​ పాటించాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్​ టి శ్రీనివాసరావు సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్కానింగ్​ సెంటర్​ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా రూపొందించిన చట్టాన్ని అందరూ గౌరవించాలని, వైద్యులు చట్టాన్ని ఉల్లఘించరాదని సూచించారు. కలెక్టర్​ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్​ వారియర్​ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్​ నిర్వాహకులు, వైద్యులు నిబంధనలు పాటించాలని అన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్​ బి మాలతి, న్యాయమూర్తులు ఎ ఆశారాణి, శాంతిసోని, పి మౌనిక, బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, డీఎంవో డాక్టర్​ బి సైదులు, న్యాయవాదులు ఇమ్మడి లక్ష్మీనారాయణ, కల్యాణి పాల్గొన్నారు.
 

ఇసుక సీజ్

పెనుబల్లి, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని కొండ్రుపాడు గ్రామంలో ప్రైవేట్ వ్యక్తులు వాగులో నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను డంప్  చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్  రమాదేవి తనిఖీలు చేపట్టి120 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఆర్ఐ భాస్కర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
 

డెంగీతో బాలుడి మృతి

పాల్వంచ,వెలుగు: పట్టణంలోని జయమ్మ కాలనీకి చెందిన నంద్యాల శరత్ కృష్ణ(4)డెంగీతో చనిపోయినట్లు పేరెంట్స్ శ్రీను, తిరుపతమ్మ తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న తమ కొడుకుకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. జ్వరం బారిన పడి చాలా మంది బాధ పడుతున్నారని, కాలనీలో మెడికల్ క్యాంప్​ ఏర్పాటు చేయాలని కోరారు. 

పారిశ్రామికవేత్తలకు మూడు రోజుల వర్క్​షాప్

భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాపారాలు చేస్తున్న  గిరిజన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు వర్క్ షాప్​ నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ధిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించుకునేలా శిక్షణ​ఇవ్వనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలు అవసరమైన సర్టిఫికెట్లతో గిరిజన భవనానికి రావాలని కోరారు.

అప్పుల బాధతో లారీ డ్రైవర్​ ఆత్మహత్య

చండ్రుగొండ, వెలుగు: మండలంలోని మద్దుకూరు గ్రామంలో అప్పుల బాధతో శీలం రవి (27) మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. లారీ డ్రైవర్ గా పని చేస్తూ రవి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అవసరాల కోసం గ్రామంలో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు డబ్బులు అడగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావు కు అప్పులే కారణమని, వాటిని తీర్చే స్థోమత లేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్ రాశాడు. రవికి భార్య శ్యామల, కుమారుడు సాయి పవన్, ఏడాదిన్నర కూతురు కౌశిక ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు.

లోన్​ పరిమితి పెంపు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పోలీస్​ అసోసియేషన్​ విజ్ఞప్తి మేరకు సొసైటీ నుంచి తీసుకునే లోన్​ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినట్లు పోలీస్ కమిషనర్​ విష్ణు ఎస్​ వారియర్​ తెలిపారు. మంగళవారం అసోసియేషన్​ సభ్యులు సీపీని కలిసి పరిమితిని పెంచాలని కోరగా, సీపీ అందుకు అంగీకరించారు. పోలీసుల​కుటుంబసభ్యుల అత్యవసర చికిత్స కోసం వెంటనే నగదు పొందే వెసులుబాటుతో పాటు చదువులు, ఆడపిల్లల వివాహం కోసం వెంటనే లోన్​ పొందవచ్చని తెలిపారు. పోలీస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్​ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జాయింట్​ సెక్రటరీ  జానిమియా, చక్ర కళాధర్​ సీపీకి బొకేను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. 

వైరాకు చేరుకున్నసైకిల్ యాత్ర

వైరా,వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించాలని కోరుతూ చౌటుప్పల్  రాంనగర్ కు చెందిన బోధుల యాదగిరి చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం వైరాకు చేరుకుంది. బీజేపీ ఇన్​చార్జి నెల్లూరు కోటేశ్వరరావు, ఏలే భద్రయ్య, కోసూరి గోపాలకృష్ణ, మనుబోలు వెంకటకృష్ణ ,పాపగంటి నరేశ్, పిల్లి సతీశ్​ ఆయనకు స్వాగతం పలికారు. 

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

చండ్రుగొండ,వెలుగు: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వీఆర్ఏల సంఘం జిల్లా నాయకుడు చాంద్ మీరా అన్నారు. మండలంలోని 8 మంది  వీఆర్ఏలను మంగళవారం ఎస్సై విజయలక్ష్మి ఆధ్వర్యంలో  పోలీసులు ముందస్తు గా అరెస్ట్ చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలి పెట్టారు. సైదా, నవీన్, లక్ష్మీపతి, జయరాజ్, ముత్తయ్య, మౌలానాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోడు సర్వేను పారదర్శకంగా చేపట్టాలి

ఖమ్మం టౌన్, వెలుగు: పోడు భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. రఘునాథపాలెం మండలం పంగిడి విలేజ్ లో మంగళవారం సర్వేను పరిశీలించారు. భుక్యా ప్రసాద్ కు సంబంధించిన పోడు భూమి సర్వేను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేను వేగంగా పూర్తి చేసి నివేదికను గ్రామసభలో అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రైమరీ స్కూల్, అంగన్​వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. సెకండ్, ఫిఫ్త్ క్లాస్  స్టూడెంట్స్ కు ఒకే గదిలో క్లాసులు ఎందుకు చెబుతున్నారని హెచ్ఎంను ప్రశ్నించారు. అంగన్​వాడీ సెంటర్ లో 23 మంది పిల్లలకు 11 మందే హాజరు కావడంపై కలెక్టర్  అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎఫ్​వో సిద్ధార్థు విక్రమ్ సింగ్,ఎఫ్డీవో ప్రకాశరావు, స్పెషల్ ఆఫీసర్  కె.సత్యనారాయణ, ఎఫ్ఆర్వో రాధిక,ఆర్అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, ఎంఈవో శ్రీనివాసరావు, హెచ్ఎం శివలక్ష్మి, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో శ్రీనివాస రెడ్డి, సర్పంచ్ బి.మంగీలాల్  పాల్గొన్నారు.

కామేపల్లి: ఆర్వోఎఫ్ఆర్​ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. మండలంలోని శ్రీరామ్ నగర్ తండాలో సర్వేను ఆమె పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి భూములకు హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు. అర్హులైన రైతులు తాము సాగు చేస్తున్న భూములకు హద్దులు చూపించి సర్వేకి సహకరించాలని కోరారు. తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో సిలార్ సాహెబ్, ఎంపీవో సత్యనారాయణ, సర్పంచ్ అజ్మీరా రాందాస్, ఎఫ్​బీవో నాగరాజు,  పంచాయతీ సెక్రటరీలు అనిల్ కుమార్, పార్వతి పాల్గొన్నారు.

అంజన్నకు అభిషేకం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం పంచామృతాలతో అభిషేకం చేశారు. గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి ముందుగా సమస్త నదీజలాలతో తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి తమలపాకులు, అప్పాల మాలలు నివేదించారు. హనుమాన్​చాలీసా పారాయణం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామికి ఉదయం సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం జరిగింది.