చేప పిల్లల పంపిణీకి 12 జిల్లాల్లో మరోసారి షార్ట్ టెండర్లు

చేప పిల్లల పంపిణీకి 12 జిల్లాల్లో మరోసారి షార్ట్ టెండర్లు
  • భారీ వర్షాలకు నిండుకుండల్లా చెరువులు, ప్రాజెక్టులు
  • విత్తన చేప పిల్లల పంపిణీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ 
  •   ఆన్ లైన్ లో టెండర్ పత్రాలు అందుబాటులో ఉంచిన మత్స్యశాఖ  అధికారులు
  • ఈనెల 19 వరకు అప్లైకి అవకాశం

మెదక్ /నిజాంపేట, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్​లు, చెరువులు నిండు కుండల్లా మారాయి. దీంతో నీటి వనరుల్లో చేపల పెంపకానికి పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడింది. అయితే.. విత్తన చేప పిల్లల విడుదలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో12 జిల్లాల్లో మరోసారి టెండర్​నిర్వహించేందుకు ఫిషరీస్​డిపార్ట్​మెంట్​తాజాగా షార్ట్​టెండర్​ నోటిఫికేషన్​ రిలీజ్ చేసింది. 

ఫిష్ ఫామ్స్ సరిగా లేకపోగా..

చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల వద్దకు ఫిషరీస్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ కు వెళ్లినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్ల ఫిష్ ఫామ్స్ సరిగా లేవని, మరికొన్ని చోట్ల చేప పిల్లలు నాణ్యమైనవి లేవని గుర్తించారు. రైతుల పట్టా పాస్ బుక్ లు, కాంట్రాక్టర్ ల రిజిస్ట్రేషన్ లు కూడా సరిగా లేవని తేలింది. దీంతో మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్​, వనపర్తి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో టెండర్లను రద్దు చేసి రీ టెండర్​నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Also Read :- రిజర్వాయర్లు ఫుల్​ పంటలకు భరోసా

షార్ట్ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్

మొదటి, రెండోసారి టెండర్లు మొత్తానికే దాఖలు కాని 5 జిల్లాలు, రద్దు చేసిన 7 జిల్లాలు కలిపి మొత్తం 12 జిల్లాల్లో చేప విత్తన పిల్లల సరఫరాకు మత్య్సశాఖ సోమవారం షార్ట్​ టెండర్​ నోటిఫికేషన్​జారీ చేసింది. ఆన్ లైన్ లో బిడ్ డాక్యుమెంట్  ను డౌన్​లోడ్​ చేసుకోవ చ్చు. ఈనెల12 నుంచి టెండర్​ దాఖలుకు అవకాశం ఉండగా.. ఇదే నెల 19న సాయంత్రం టెండర్లు తెరుస్తారు. 

100 శాతం సబ్సిడీపై ఇస్తున్నా..

'దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని'  చందంగా మారింది ఉచిత చేప విత్తన పిల్లల  పంపిణీ స్కీం పరిస్థితి. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 26,357 నీటి వనరుల్లో  చేపల పెంపకం కోసం100 శాతం సబ్సిడీపై 86 కోట్ల విత్తన చేప పిల్లలు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో  ఫిషరీస్​ డిపార్ట్​మెంట్​ గత జులైలో టెండర్లు పిలిచింది. 32 జిల్లాల్లో ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్లు వేయలేదు. మళ్లీ ఆగస్టులో రెండోసారి టెండర్లు పిలువగా 27 జిల్లాల నుంచే మాత్రమే టెండర్లు వచ్చాయి. కాగా.. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి​జిల్లాల్లో ఒక్క టెండర్​కూడా వేయలేదు. 

ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తున్నం 

మత్స్యకారులకు ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ఈనెల 9 నుంచి19వ తేదీ వరకు షార్ట్ టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్​ లైన్​ ద్వారానే టెండర్లు వేయాలి. ఈసారి టెండర్లు పడతాయని ఆశిస్తున్నాం. మల్లేశం, మెదక్​ జిల్లా ఫిషరీస్​ ఆఫీసర్​