- సర్కారు బ్లడ్ బ్యాంకులో తీవ్ర కొరత
- పెరిగిన డెంగ్యూ కేసులు
- బ్లడ్డోనర్ల కోసం ఎదురు చూపులు
- పరిస్థితులను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్బ్లడ్ బ్యాంకులు
నిజామాబాద్ జిల్లాలో రక్తం నిల్వల కొరత ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు యాక్సిడెంట్లు, డెలివరీలు, కొన్ని ఆపరేషన్ లుచేసే సమయంలో రోగులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ నిల్వల కొరత వేధిస్తుండటంతో ప్రభుత్వ డాక్టర్లు ఆపసోపాలు పడుతున్నారు. తాజాగా వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతుండగా ప్లేట్లెట్స్ కోసం బ్లడ్ అవసరమవుతోంది. దీంతో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు భారీ బిజినెస్‌కు తెరలేపాయి.
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీకి అనుబంధంగా జీజీహెచ్ హాస్పిటల్ఏర్పడ్డాక ఇక్కడి జిల్లా హాస్పిటల్‌ను బోధన్‌కు షిష్ట్ చేశారు. ఈ రెండు చోట్ల బ్లడ్ బ్యాంకులున్నాయి. సీజనల్ వ్యాధుల కారణంగా జీజీహెచ్ లో ప్రతీ రోజు ఓపీ 2,500 దాటుతోంది. వైరల్ జ్వరాలతో పాటు డెంగ్యూ బాధితులు ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అవుతున్నారు.
గత నెలలో అత్యధికంగా 249 డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఈ నెలలో ఇప్పటికి వంద దాటాయి. హాస్సిటల్లోని బ్లడ్ బ్యాంకులో 300 యూనిట్ల రక్త నిలువలు మాత్రమే మెయింటెయిన్ చేస్తున్నారు. సాధారణంగా ప్రతీ రోజు పది యూనిట్లను డెలివరీలు, యాక్సిడెంట్లు, ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. సర్కారు హాస్పిటల్‌కు వచ్చేవారిలో ఎక్కువగా గ్రామీణ ప్రజలే ఉంటారు.
వారికి రక్తదానంపై అవగాహన లేకపోవడంతో దవాఖానాలో ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేసిన తమ వారి బ్లడ్ అవసరాలకు సర్కారు ఏర్పాట్లపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు డెంగ్యూ పీడితుల సంఖ్య పెరగడంతో ప్లేట్లెట్ల కోసం రోజు అదనంగా మరో ఐదు యూనిట్ల వినియోగం పెరిగింది. వెరసి డిమాండ్‌కు సరిపడా రక్తం నిల్వలు లేక వలంటరీ డోనర్ల కోసం దిక్కులు చూడాల్సివస్తోంది. బోధన్ హాస్పిటల్‌లోని బ్లడ్ బ్యాంకు నిర్వహణ తూతూ మంత్రంగా జరుగుతోంది.
రెడ్ క్రాస్‌లో తలసేమియా వార్డు
జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌లో 400 యూనిట్ల రక్తం నిల్వలు మెయింటెయిన్ చేస్తున్నారు. అక్కడ తలసేమియా బాధితుల కోసం ప్రతి మంగళ, శుక్రవారాలలో ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన వార్డుకు రక్తం ఎక్కించే రోజు 30కి తక్కువ కాకుండా బాధితులు వస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎవరైనా ఒక యూనిట్ బ్లడ్ కోసం వస్తే ప్రతిగా మరో యూనిట్బ్లడ్ సేకరిస్తున్నారు.
ప్రైవేట్ బ్యాంకుల దోపిడీ
ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు, రెడ్‌క్రాస్ సంస్థ పరిస్థితి ఇలా ఉండగా, నిజామాబాద్‌లోని నాలుగు బ్లడ్ బ్యాంకులు బిజినెస్ చేస్తున్నాయి. ఆటోరిక్షా డ్రైవర్లు, కూలీ అడ్డా లేబర్లకు రూ.300 చెల్లించి యూనిట్ బ్లడ్ సేకరిస్తున్నారు. వాటిని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు అమ్ముతున్నారు. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లైతే రూ.10 వేల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
రక్తదాన క్యాంప్‌లకు ప్లాన్
రక్తం అవసరాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. బ్లడ్ బ్యాంక్‌లో ఉన్న నిల్వలను జాగ్రత్తగా వాడుతూ కొరత పెరగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాతల నుంచి రక్తం సేకరించడానికి క్యాంపులు నిర్వహణకు ప్లాన్ చేస్తున్నం. దాతలు అధిక సంఖ్యలో ముందుకురావాలి.
డాక్టర్ ప్రతిమారాజ్, జీజీహెచ్, సూపరింటిండెంట్