భద్రాద్రి ఏరియా దవాఖానలో డాక్టర్లు, సిబ్బంది కొరత

  • పెద్దాసుపత్రిలో పోస్టులు భర్తీ చేస్తలే
  • భద్రాద్రి ఏరియా దవాఖానలో డాక్టర్లు, సిబ్బంది కొరత

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లను నియమించడం లేదు. 12 మంది గైనకాలజిస్టులు ఉండాల్సిన ఆసుపత్రిలో ముగ్గురే ఉన్నారు. 207 మంది సిబ్బంది పని చేయాల్సిన చోట 86 మందితో నాలుగు రాష్ట్రాల రోగులకు సేవలు అందిస్తున్నారు. డాక్టర్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం చాలా సార్లు ప్రకటనలు చేసినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా మన్యంలో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల మావోయిస్టులు సైతం ఏరియా ఆసుపత్రిలో గిరిజనులకు వైద్యం దొరకడం లేదంటూ ప్రకటన జారీ చేశారు. 200 పడకల ఆసుపత్రిలో ఉండాల్సినంత సిబ్బందిని కూడా నియమించడం లేదు. నేషనల్​ హెల్త్ మిషన్  ద్వారా ఏరియా ఆసుపత్రికి రెండు గైనకాలజిస్టు పోస్టులు ఇచ్చారు. వాటిని సకాలంలో భర్తీ చేయకపోవడంతో రద్దు చేశారు.  4 సివిల్​సర్జన్, 1 సీఎస్ఆర్ఎంఓ, 9 డిప్యూటీ సివిల్​ సర్జన్, 1 డిప్యూటీ డెంటల్​ సర్జన్, 25 సివిల్​ అసిస్టెంట్​ సర్జన్, 1 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, 2 డెంటల్​ అసిస్టెంట్ సర్జన్, 31 నర్సింగ్​ స్టాఫ్, 28 పారా మెడికల్​ స్టాఫ్, 5 మినిస్టీరియల్  స్టాఫ్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వసతులు అన్నీ ఉన్నా సిబ్బంది కొరతే ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రతిరోజు ఆసుపత్రికి 1000 మందికి పైగా అవుట్​ పేషెంట్లు వస్తుండగా, వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. 

అన్నీ సమస్యలే..

టిఫా కేంద్రాన్ని ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది. ఉచితంగా స్కానింగ్ చేసేందుకు పరికరాలు వచ్చినా, స్కానింగ్​ చేసే పాథాలజిస్టు, సిబ్బంది లేరు. 1999లో ఏర్పాటు చేసిన బ్లడ్​ బ్యాంకులో  పాథాలజిస్టు, ఇద్దరు స్టాఫ్​ నర్సులు, నలుగురు ల్యాబ్​టెక్నీషియన్లు, ఒక నాల్గోతరగతి ఉద్యోగి, కౌన్సెలింగ్​ ఇచ్చే ఆఫీసర్​ ఉండాలి. అన్నీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 2016లో ప్లేట్​లెట్​ మెషీన్లు పెట్టినా అవీ పని చేయడం లేదు. వీటి కోసం రోగులు ప్రైవేట్ ల్యాబ్​లకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 

సర్దుబాటు పేరుతో..

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జాయిన్​ అయి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24 మంది సిబ్బంది డిప్యుటేషన్​పై పని చేస్తున్నారు. జిల్లాలో పెద్ద ఆసుపత్రి కావడంతో ఇక్కడ పోస్టులు ఉంటాయి. దీంతో కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులను నియమించుకుని వారిని వైద్యులు లేని ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసి జిల్లా అంతటా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇల్లందు, బూర్గంపాడు, మణుగూరు తదితర ప్రాంతాల్లో వీరు పని చేస్తున్నారు. 

సిబ్బంది కొరత ఉన్నా కాన్పుల్లో మిన్న..

ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కాన్పుల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి నెలా 300 పైగా కాన్పులు చేస్తున్నారు. 2021–-22లో 3,959 కాన్పులు జరిగాయి. 2022–-23 ఏడాదికి ఇప్పటికే 2,550 కాన్పులు చేశారు. 12 మంది గైనకాలజిస్టులకు గాను ముగ్గురే సేవలు అందిస్తున్నారు. సూపరింటెండెంట్​తో పాటు ఉన్న వైద్యులే సాధారణ, సిజేరియన్​ కాన్పులు నిర్వహిస్తున్నారు. 

పోస్టులు వెంటనే చేయాలి..


జిల్లా ఆసుపత్రి కంటే ఎక్కువ మంది పేషెంట్లు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వస్తుంటారు. వైద్యులు, సిబ్బంది పోస్టుల ను వెంటనే భర్తీ చేయాలి. టిఫా స్కానింగ్ సెంటర్  పని చేసేలా చూడాలి. దీంతో గర్భిణులకు ఆర్థికభారం తప్పుతుంది. 

బ్రహ్మాచారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..


త్వరలోనే డాక్టర్​ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. ఉన్నవాళ్లమే పనిని పంచుకుంటున్నాం. రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. 
- డా.రామకృష్ణ,  ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్